ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం..ఇక్కడ ఎన్నిక ఎన్నికకు గెలుపు మారిపోతూ ఉంటుంది. అయితే వరుసగా మాత్రం కమ్యూనిస్ట్ పార్టీనే గెలిచింది. 1983లో టిడిపి గెలవగా, 1985, 1989, 1994 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. మళ్ళీ 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. 2004లో కూడా టిడిపి సత్తా చాటింది. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి పితాని సత్యనారాయణ విజయం సాధించారు.
అయితే తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు డ్యామేజ్ జరగడంతో పితాని..టిడిపిలోకి వచ్చారు. అటు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ముదునూరి ప్రసాద్ రాజు వైసీపీలోకి వెళ్లారు. 2014లో వీరి మధ్య పోరు జరగగా, స్వల్ప మెజారిటీతో పితాని గెలిచారు. ఇక చంద్రబాబు కేబినెట్ లో పితాని మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. ప్రసాద్ రాజు తన సొంత స్థానం నరసాపురంకు వెళ్ళిపోయారు. ఇటు ఆచంటలో వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేశారు.

ఇక జనసేన అనూహ్యంగా ఓట్లు చీల్చడంతో వైసీపీ గెలిచింది. టిడిపి నుంచి పితాని పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన చెరుకువాడ జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక మధ్యలోనే ఆయనకు పదవి పోయింది. మంత్రిగా పెద్దగా మెప్పించలేదు. ఎమ్మెల్యేగా కూడా ఆచంటకు చేసిందేమి కనిపించడం లేదు. ఆయనపై నెగిటివ్ ఉంది. ఇటు టిడిపి నుంచి పితాని బలపడుతున్నారు.
అదే సమయంలో ఆయన జనసేనతో పొత్తు ఉండాలని బలంగా కోరుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయారు. అప్పుడు దాదాపు వైసీపీపై 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే..జనసేనకు దాదాపు 14 వేల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మరిన్ని ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక టిడిపి-జనసేన పొత్తులో పితాని పోటీ చేసి..చెరుకువాడకు చెక్ పెట్టడం ఖాయమే.
