ఆయన టీడీపీ ఎమ్మెల్యే. నిజానికి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏదైనా సమస్య వస్తే.. పెద్దగా స్పందిం చడం లేదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. అయితే.. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మాత్రం దూకుడుగా ఉన్నారు. జిల్లా సమస్యలు, రైతాంగం కష్టాలు.. ఇలా సమస్య ఏదైనా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే.. ఆయా సమస్యలపై గల్లిలోనే కాదు.. ఢిల్లీ వరకు కూడా పోరు సల్పుతున్నారు. ఇలా.. ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం కోసం.. ఇక్కడి టీడీపీ యువ నాయకుడు.. గొట్టిపాటి రవి అలుపెరుగని పోరుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలను విభజించి మరో 13కొత్తజిల్లాలను తీసుకువచ్చి.. మొత్తం 26 జిల్లాలు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే.. నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే.. వీటిలో కొన్ని చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులే ఉద్యమిస్తున్నారు. కానీ, ప్రకాశం జిల్లా అద్దంకి కోసం.. ఉద్యమిస్తున్న నాయకుడు ఒక్కరూ లేకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో ఇక్కడి ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ఎమ్మెల్యే రవి నడుంబిగించారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. అయితే.. వీరి గోడును ఇక్కడి అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగిన గొట్టిపాటి.. కొన్ని రోజులుగా అద్దంకి కోసం.. ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల పక్షాన సమస్యను భుజాన వేసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని.. కోరుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేతలు,అఖిలపక్ష నాయకులతో కలిసి ఒంగోలులో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. స్థానికంగాఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అధికార పార్టీ నాయకులు ముందుకు రావాల్సి ఉన్నా.. రావడం లేదని.. విమర్శించారు. మొత్తంగా చూస్తే.. గొట్టిపాటి పట్టుదలకు సర్కారు దిగివస్తుందని.. ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Discussion about this post