కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జిల్లాలో బలంగా కనిపించిన వైసీపీకి ఇప్పుడు నిదానంగా లీడ్ తగ్గుతుంది. జిల్లాలో అనూహ్యంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు 10 సీట్లలో వైసీపీకి ఆధిక్యం లేదు. జిల్లాలో సగం సీట్లలో వైసీపీకి లీడ్ తగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిన విషయం తెలిసిందే. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి లాంటి సీట్లలో వైసీపీ లీడ్ తగ్గి, టీడీపీ పుంజుకుంటుంది. ఇటు నెల్లూరు రూరల్, వెంకటగిరిల్లో వైసీపీకి భారీ షాకులు తగిలిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. దీంతో వైసీపీకి ఆ రెండు చోట్ల భారీ షాక్ తగిలినట్లు అయింది. ఇక ఆ రెండు చోట్ల డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.


ఇప్పటికే వెంకటగిరిలో ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. తాజాగా నెల్లూరు రూరల్‌కు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టారు. ఇంచార్జ్ అయ్యాక ఆయన తాజాగా రూరల్ నియోజకవర్గానికి వచ్చారు. అయితే ఆదాల ఎంతవరకు రూరల్ లో వైసీపీ డ్యామేజ్‌ని కంట్రోల్ చేస్తారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే రూరల్‌లో వ్యక్తిగంగా కోటంరెడ్డికి ఇమేజ్ ఉంది. పార్టీ బలం ఉన్నా సరే సొంత ఇమేజ్ బాగానే ఉంది.


ఇప్పుడు కోటంరెడ్డి వైసీపీని వీడటం ఆ పార్టీకి నష్టమే. పైగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. ఈ పరిస్తితుల్లో ఆదాల..రూరల్‌లో వైసీపీకి జరిగిన డ్యామేజ్‌ని పూడ్చటం చాలా కష్టమని తెలుస్తోంది. చూడాలి మరి ఎన్నికల్లో రూరల్ వైసీపీకి దక్కుతుందో లేదో.
