ఏపీ రాజకీయాల్లో సెల్ఫీ ఛాలెంజ్‌లు పెరిగాయి..అధికార వైసీపీ అభివృద్ధి చేయడం లేదని, ఇంకా దెబ్బతీస్తుందని, అలాగే టీడీపీ హయాంలోనే అభివృద్ధి ఎక్కువ జరిగిందనే నిరూపించే విధంగా నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పాదయాత్రలో ఎక్కడైతే గత టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసిందో..అలాగే కొత్త కంపెనీలని తీసుకొచ్చిందో అక్కడ లోకేష్ సెల్ఫీలు దిగి వైసీపీకి ఛాలెంజ్ చేస్తున్నారు.
ఈ మద్య కియా పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ తీసుకుని ఇది తాము తీసుకోచ్కిన కంపెనీ అని మరి మీరు ఏం తీసుకొచ్చారని వైసీపీకి ఛాలెంజ్ చేశారు. అటు వైసీపీ నేతల అక్రమాలపై కూడా సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ మధ్య ధర్మవరం చెరువు మధ్యలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి గెస్ట్ హౌస్ గురించి..ఇది అక్రమంగా కట్టుకున్న గెస్ట్ గౌస్ అని లోకేష్ సెల్ఫీ తీసుకుని పెట్టారు. ఇటు చంద్రబాబు నెల్లూరుకు వెళ్ళి తమ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లని, మరి ఇప్పుడు ఎన్ని ఇళ్ళు కట్టారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

ఇక లోకేష్, బాబు లని టిడిపి నేతలు, కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. ఇదే క్రమంలో పెనమలూరు నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ బోడే ప్రసాద్…వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టార్గెట్ గా ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా యనమలకుదురు బ్రిడ్జ్ అంశంపై ఛాలెంజ్ చేశారు. “యనమలకుదురు బ్రిడ్జి నా హయంలో 90% పూర్తి చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని, కానీ మిగిలిన 10% శాతం నువ్వు ఎమ్మెల్యేగా గా 4 సంవత్సరాలు అయినా పూర్తిచెయ్యనందుకు సిగ్గుగా ఉంది కాసుల పార్థసారధి” అంటూ బోడే సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
ఇక తాడిగడపలోని ఓ కాలనీలో ఉన్న ప్లాట్ వద్దకు వెళ్ళి “ఇది తడిగాడపలోని STBL కాలనీ లో నీకు ఈ ప్లాట్ ఎలా వచ్చిందో బహిరంగ రహస్యం. తాడిగడప బ్రిడ్జి శాంక్షన్ చేసినందుకు 450 చ.గ.ల స్థలం నజరానా. బ్రిడ్జి కాంట్రాక్ట్ చేసింది నువ్వే. అది అధికార దుర్వినియోగం కాదా? ఈ మొన్ననే ఈ స్థలం 1.5 కోట్లకు అమ్ముకున్నావ్. కాదని చెప్పగలవా సారధి?” అంటూ బోడే ఫైర్ అయ్యారు. ఇక బోడే సెల్ఫీలకు మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే అక్కడ సారథిపై వ్యతిరేకత ఉంది. ఈ ఛాలెంజ్‌లతో మరింత వ్యతిరేకత పెరిగేలా ఉంది. ఈ దెబ్బతో సారథి ఓటమి ఖాయమని అంటున్నారు.
