ఒంగోలు ఎంపీ సీటు..మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా అనుకూలంగా లేని స్థానం. కేవలం ఇక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1984, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. అంటే ఒంగోలుపై టిడిపికి ఎంత పట్టు ఉందో అర్ధమవుతుని. ఇక మెజారిటీ సార్లు కాంగ్రెస్ గెలవగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. కానీ ఈ సారి మాత్రం ఒంగోలులో టిడిపి జెండా ఎగరవేయాలని తెలుగు తమ్ముళ్ళు కష్టపడుతున్నారు.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి వేవ్ ఉన్నప్పుడు ఇక్కడ గెలవాల్సింది..అప్పుడు కేవలం 15 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడింది. 2019లో భారీ మెజారిటీతోనే ఓడింది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. వైసీపీకి వ్యతిరేకత పెరుగుతుంది. ఒంగోలు పరిధిలో టిడిపికి బలం పెరుగుతుంది. దీంతో ఈ సారి ఒంగోలు టిడిపి వశం అయ్యేలా ఉంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మార్కాపురం, కొండపి, ఒంగోలు, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఒక కొండపి తప్ప మిగిలిన సీట్లలో టిడిపి ఓడింది. కానీ ఇప్పుడు నిదానంగా మిగతా సీట్లపై టిడిపి పట్టు సాధిస్తుంది. ఎలాగో కొండపిలో టిడిపికి లీడ్ ఉంది. ఇటు దర్శిలో పట్టు సాధించింది..టిడిపి-జనసేన పొత్తు ప్రభావం అక్కడ ఎక్కువ. అలాగే కనిగిరిలో టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఒంగోలులో సైతం టిడిపి రేసులోకి వచ్చింది.
యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు స్థానాల్లో వైసీపీకి ధీటుగా టిడిపి ముందుకెళుతుంది. కాబట్టి ఈ సారి ఒంగోలు పార్లమెంట్‌ని టిడిపి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పైగా ఎంపీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. అది టిడిపికే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి 1999 తర్వాత ఒంగోలుని టిడిపి దక్కించుకునేలా ఉంది.