రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో జనసేనతో పొత్తు విషయంలో తెలుగు తమ్ముళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు గానీ…అమలాపురం పార్లమెంట్ పరిధిలోని తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఖచ్చితంగా పొత్తు ఉంటేనే బెటర్ అనే పరిస్తితి. పొత్తు ఉంటేనే ఇక్కడ సత్తా చాటగలమని తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి ఓటమికి ప్రధాన కారణం జనసేన మాత్రమే. ఇక్కడ జగన్ గాలి కంటే…జనసేన చీల్చిన ఓట్ల వల్లే టిడిపి ఓడిపోయింది.

అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. మండపేటలో టిడిపి గెలవగా, రాజోలులో జనసేన గెలిచింది. అయితే ఇక్కడ టిడిపి కేవలం మండపేటలో గెలిచి…మిగిలిన చోట్ల ఓడిపోవడానికి జనసేన కారణం. రాజోలులో ఎలాగో జనసేన గెలిచింది. అయితే గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.

ఈ స్థానం పక్కనబెడితే…అమలాపురం అసెంబ్లీలో టిడిపి మీద వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. వైసీపీకి 25 వేల ఓట్ల మెజారిటీ రాగా, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి. ముమ్మిడివరంలో టిడిపిపై వైసీపీకి 5 వేల ఓట్ల మెజారిటీ వస్తే, జనసేనకు 33 వేల ఓట్లు పడ్డాయి. పి.గన్నవరంలో వైసీపీకి 22 వేల ఓట్ల మెజారిటీ రాగా, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి.

కొత్తపేటలో వైసీపీకి 4 వేల ఓట్ల మెజారిటీ వస్తే, జనసేనకు 35 వేల ఓట్లు పడ్డాయి. రామచంద్రాపురంలో 5 వేల ఓట్ల మెజారిటీ వస్తే, జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అటు అమలాపురం పార్లమెంట్ స్థానంలో కూడా ఇదే పరిస్తితి….వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లు చాలా ఎక్కువ. అంటే ఇక్కడ జనసేన…టిడిపి గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకనే ఇక్కడ తమ్ముళ్ళు, జనసేనతో పొత్తు ఉంటేనే బెటర్ అనుకుంటున్నారు. లేదంటే మళ్ళీ చిక్కులు తప్పవు.

Discussion about this post