రాష్ట్రంలో మొదట నుంచి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలపై టీడీపీకి అంత పట్టు లేదనే చెప్పాలి. ఈ నియోజకవర్గాల్లో అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. రెండు స్థానాలు మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది. కొండపిలో టీడీపీ గెలవగా, రాజోలులో జనసేన గెలిచింది. ఇక జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే తర్వాత వైసీపీ వైపుకు వెళ్లిపోయారు.

అంటే ఎస్సీ స్థానాల్లో వైసీపీదే పూర్తి ఆధిక్యం. అయితే ఆ ఆధిక్యం ఇప్పుడుప్పుడే తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సారి అంత సులువుగా ఎస్సీ స్థానాల్లో వైసీపీ హవా నడవటం కష్టమని తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఈ సారి టీడీపీ సత్తా చాటేలా ఉంది.

అలా టీడీపీ సత్తా చాటే నియోజకవర్గాల్లో మొదట తాడికొండ ఉంటుందని చెప్పొచ్చు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ ఈమె గెలుపు గగనమని తెలుస్తోంది. అలాగే ప్రత్తిపాడులో హోమ్ మంత్రి సుచరిత గెలుపు కూడా అంత సులువు కాదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచేశారు గానీ, ఈ సారి మాత్రం గెలవడం కష్టమని అర్ధమవుతుంది.


అటు వేమూరులో ఎమ్మెల్యే మేరుగు నాగార్జునపై కూడా ప్రజా వ్యతిరేకత పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇటు సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు అంత అనుకూలమైన వాతావరణం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని తెలుస్తోంది. ఈ నాలుగు చోట్ల ఇప్పుడు టీడీపీ బలోపేతం అవుతుంది. ఎన్నికల నాటికి ఇంకా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి నాలుగు స్థానాల్లో వైసీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది.


Discussion about this post