మొత్తానికి వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. మొదట నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ఎప్పుడు ఏదో రకంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఆనంకు..తాజాగా జగన్ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న ఆనం..తాజాగా వైసీపీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారని..అదే జరిగితే వైసీపీ త్వరగా ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.

దీంతో జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఆనంకు చెక్ పెడుతూ..వెంకటగిరి ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి సీటు ఆనంకు ఇవ్వరని తేలిపోయింది. ఇప్పటికే వెంకటగిరి సీటు తనదే అని నేదురుమల్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆనంకు నెక్స్ట్ ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు. నెల్లూరు లో ఏ సీటు ఖాళీ లేదు.

ఇదే సమయంలో ఆనం టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కుమార్తె కైవల్య రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మకూరు సీటు తీసుకుంటారని ప్రచారం ఉంది. ఇటు ఆనం..నెల్లూరు సిటీ సీటు తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి ఆనంని తప్పించి జగన్..ఆటోమేటిక్ గా ఆనంకే మేలు చేసినట్లు అయిందని అంటున్నారు. అసలు వైసీపీ నుంచి వెళ్లిపోయేలా చేయడమే ఆనంకు కావాల్సిందని చెబుతున్నారు. మరి చివరికి ఆనం ఎటు వైపు వెళ్తారో చూడాలి.
