అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు.


దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు మైలవరంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో వసంతకు పెద్ద తలనొప్పి ఉంది..నెక్స్ట్ మైలవరం సీటు జోగికి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో వసంత టీడీపీ వైపు రావడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే జగన్‌కు విధేయురాలుగా ఉండే మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత..తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చారు. మొదట నుంచి జగన్‌కు అండగా ఉంటున్న సుచరితకు..ఇటీవల వైసీపీలో అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కడం లేదు.

ఇదే సమయంలో సుచరిత భర్త దయాసాగర్..జనసేనలోకి వెళ్తారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై సుచరిత పరోక్షంగా స్పందించారు. వైసీపీలో మన్నగలిగిన అన్ని రోజులు ఉంటామని, ఇక తాము వైసీపీ కుటుంబ సభ్యులమని, కానీ తన భర్త వేరే పార్టీలోకి వెళ్తానని అంటే..ఓ భార్యగా ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం తనకు ఉందని చెప్పుకొచ్చారు.

అంటే సుచరిత భర్త వేరే పార్టీలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు సుచరిత కూడా వెళ్ళేలా ఉన్నారు. జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, టీడీపీతో పొత్తులో భాగంగా ప్రత్తిపాడులో పోటీ చేస్తారని టాక్. మరి చూడాలి సుచరిత కూడా వైసీపీకి హ్యాండ్ ఇస్తారేమో.
