విషయం ఏదైనా… నాయకులను అదుపు చేయాల్సి వచ్చినప్పుడు… నిక్కచ్చిగానే వ్యవహరించాలి. నాయకులను లైన్‌లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు.. ముఖ్యంగా ఆ పార్టీ చాలా బెస్ట్ గురూ! అని అనిపిం చుకోవాలని అనుకున్నా.. ఖచ్చితంగా.. పార్టీల్లో దూకుడుగా ఉన్న నాయకులకు.. బరితెగించిన నేతలకు తగిన విధం గా పార్టీలు గుణ పాఠం చెప్పాలి. ఒక్కసారి తీసుకున్న చర్య.. మళ్లీ మళ్లీ పార్టీలో నేతలకు గుర్తుండి పోయేలా చేయాలి. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అలానే చేశారు.

శాసన మండలిలో ఒక మీడియా అధినేతను వ్యంగ్యంగా మాట్లాడారని.. తనను ప్రశ్నించారని.. భావించి న.. ఎన్టీఆర్.. ఒక్క కలంపోటుతో మండలినే రద్దు చేసి పడేశారు. నాయకుల విషయంలోనూ ఆయన అలానే వ్యవహరించారు. నాదెండ్ల భాస్కరరావు ఎఫెక్ట్‌తో ఆయన ఎవరినీ దగ్గరకు కూడా చేరనివ్వలేదు. దీంతో ఎన్టీఆర్, టీడీపీ అంటే.. నిప్పు.. అనే మాట ఇప్పటికీ స్థిరపడిపోయింది. కానీ, ప్రస్తుత అధికారపార్టీ వైసీపీ మాత్రం.. దూకుడుగా ఉన్న నాయకులపై చర్యలకు వెరస్తోందనే వాదన వినిపిస్తోంది.నిజానికి పార్టీలో చాలా మంది దూకుడుగా ఉన్నారు. ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకుంటున్నారు. అనలేని, వినలేని మాటలు కూడా అంటున్నారు. అయినా కూడా జగన్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంతకు మించి.. వ్యాఖ్యలు చేసి.. ఏకంగా కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించిన నాయకుల విషయంలో మాత్రం… చర్యలు తీసుకున్నారు. అయితే.. అవి కూడా కంటితుడుపు చర్యలుగానే ఉంటున్నాయనే వాదన ఉంది.

గతంలో వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన.. పూనూరు గౌతంరెడ్డిపై కంటితుడుపు చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టే చేసి.. మళ్లీ పార్టీలోకి తీసుకుని.. నామినేటెడ్ అయిన.. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు. మరి దీనివల్ల.. వైసీపీ ఆశించిన ప్రయోజనం కానీ, నాయకుల్లో నోటి దురదకు అడ్డుకట్టకానీ.. పడిందా? అంటే.. ప్రశ్నార్థకమే. ఇక, ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ అనంత బాబు.. ఏకంగా.. తన మాజీ డ్రైవర్‌ను హత్య చేసి.. (ఆయనే ఒప్పుకొన్నట్టు పోలీసులు చెప్పారు) శవాన్ని డోర్ డెలివరీ చేసి.. కుటుంబ సభ్యులకు అప్పగించాడు.నిజానికి ఈదేశ రాజకీయాల్లో ఇలా చేయడం.. బహుశ ఇదే మొదటి సారి.. అనుచరులు చంపించిన నాయ కులు ఉన్నారు. కానీ, ఇలా చంపేసి.. డోర్ డెలివరీ చేసిన నాయకులు లేరు. అందుకే.. ఈ విషయంలో అనంతబాబు మరింత హాట్ టాపిక్ అయ్యారు. మరి ఇంత జరిగితే.. వైసీపీ ఆయనపై గట్టి చర్యలు ఏమైనా చేపట్టిందా? పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నట్టు ప్రకటించిందా? అంటే.. ఏమీ లేదు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది.

అంటే.. దీనిని బట్టి రేపో మాపో.. ఎన్నికల సమయానికి ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. అంతేకాదు… ఇంత దారుణంగా వ్యవహరించిన నాయకుల విషయంలోనే ఇంత ఉదాశీనంగా వ్యవహరించడం ద్వారా. ఇతర నేతలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు..ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయకపోవడం గమనార్హం.
Discussion about this post