రాయలసీమలోని కీలకమైన జిల్లా అనంతపురం. ఇది ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ కేవలం రెండు స్థానాలు దక్కించుకుంటే మిగిలిన అన్ని స్థానాలను టీడీపీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. అయితే.. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ పుంజుకుంది. ఒక్క హిందూపురం.. ఉరవ కొండ మినహా.. అన్ని చోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నటీడీపీ సీమపై దృష్టి పెట్టింది.

దీంతో స్వయంగా పార్టీ అదినేత చద్రబాబు సీమలో మూడు రోజుల పాటు పర్యటించారు. మరీ ముఖ్యంగా అనంతపురంలో జరుగుతున్న అసమ్మతి రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టారు.కానీ, పైకి మాత్రంఏమీ అనకుండానే కార్యక్రమాన్ని కొనసాగించారు. వాస్తవాననికి ఇప్పుడు వైసీపీ కన్నా.. టీడీపీకి ఇక్కడ జోరు పెరిగిందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు పర్యటనలో భారీ ఎత్తున స్వాగత సత్కారాలు.. గజమాలలతో చంద్రబాబును గౌరవించడం తెలిసిందే.

అయితే.. ఇంత జరుగుతున్నా.. అనంతలో నేతల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన జేసీ కుటుంబం.. పార్టీని డెవలప్ చేయడం కంటే.. పార్టీపై ఆధిపత్య రాజకీయం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, కం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి .. పల్లెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నా రు. నీ కాలేజీలు మూయిస్తా.. నీ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు బయటకు తీస్తా.. అంటూ.. అక్కడ పర్యటించేందుకు రెడీ అయ్యారు. అయితే..దీనిని పల్లె బలంగా అడ్డుకున్నారు. దీంతో తాను అనంతపురంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని.. ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై ఇతర నేతలు కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు.

మరోవైపు పుట్టపర్తినియోజకవర్గంలో పల్లెకు వ్యతిరేకంగా.. తన అనుచరుడు సురేశ్ రెడ్డిని జేసీ ప్రోత్సహి స్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇదిలావుంటే.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు మరింత దూకుడు పెంచారనే వార్తలు వస్తున్నాయి.

ఇక, మడక శిర నియోజకవర్గంలోనూ టీడీపీగ్రూపులుగా చీలిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎం. ఈరన్న అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో ఇతర నేతలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా టీడీపీ ఇబ్బందులు పడుతోంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి పాలై.. ప్రస్తుతం ఇంచార్జ్‌లుగా ఉన్న నాయకులకు పోటీగా కొత్త ముఖాలు రంగంలోకి వస్తుండడంతో పార్టీలో పరిస్థితి అదుపు తప్పుతోందనే వాదన వినిపిస్తోంది. మరిదీనిని చంద్రబాబు ఎలా సరిచేస్తారో చూడాలి.


Discussion about this post