ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ సత్తా చాటలేకపోయింది. వైసీపీ వేవ్ లో దారుణంగా ఓడింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే నిదానంగా జిల్లాలో బలపడే దిశగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో టీడీపీ బలపడినట్లు కనిపించడం లేదు. కొంతమంది నేతలు దూకుడుగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. అదే సమయంలో కొన్ని స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది.

వాస్తవానికి అనంతలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. దీంతో కొన్ని స్థానాల్లో మార్పులు చేయాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరిని పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో వేరే నేతలకు సీట్లు ఇస్తారని సమాచారం. జిల్లాలో ప్రస్తుతం తాడిపత్రి, కదిరి, హిందూపురం, ఉరవకొండ, రాప్తాడు, రాయదుర్గం లాంటి స్థానాల్లో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గా ఉంది. శింగనమల, కళ్యాణదుర్గం, మడకశిర, అనంతపురం అర్బన్ లాంటి స్థానాల్లో ఆధిపత్య పోరు ఉంది.

అదే సమయంలో పుట్టపర్తి, గుంతకల్లు, ధర్మవరం, పెనుకొండ స్థానాల్లో టీడీపీ అనుకున్న విధంగా బలపడలేదు. అయితే ఆధిపత్య పోరు, బలపడని స్థానాల్లో కొందరు నాయకులని బాబు మార్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు పుట్టపర్తిలో వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది..కానీ అక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుకున్న మేర బలపడలేదు. దీంతో నెక్స్ట్ ఆయన్ని మారుస్తారనే ప్రచారం ఉంది.



గుంతకల్లులో టీడీపీ ఇంచార్జ్ జితేందర్ గౌడ్ పనితీరు కూడా అంతంత మాత్రమే..ఆయన్ని సైడ్ చేస్తారని తెలుస్తోంది. మడకశిరలో ఇంచార్జ్ ఈరన్నని కూడా మార్చే ఛాన్స్ ఉంది. ఇక జనసేనతో పొత్తు ఉంటే జిల్లాలోప్ ఒక సీటు ఆ పార్టీకి ఇచ్చే ఛాన్స్ ఉందట. మొత్తానికి జిల్లాలో కొన్ని సీట్లు మారే ఛాన్స్ ఉంది.

Leave feedback about this