తాజాగా మాజీ అయిన.. మంత్రి, యువ నాయకుడు.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే.. అనిల్ కుమార్ యాదవ్ దూకుడు పెంచారు. తాజాగా ఆయననిర్వహించిన ఆత్మీయ సభ.. సవాళ్ల సభగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సరే.. ఇదెలా ఉన్నప్పటికీ.. అనిల్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఇక మీదట పరిస్థితి భిన్నంగా ఉంటుందని.. తన సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సొంత పార్టీ నేతలను ఆయన దృష్టిలో పెట్టుకుని చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీలోనూ చర్చకు వచ్చాయి.

నిజానికి అనిల్ దూకుడు ఇప్పుడు కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. టీడీపీ హయాంలోనే ఆయన దూకు డుగా ఉన్నారు. కాకపోతే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రం మొత్తానికి ఆయన పరిచయం అయ్యారు అంతే. ఇక, ఇప్పుడు ఆయన చూపిస్తానన్న దూకుడుతో.. వైసీపీకి ప్లస్సవుతుందా? మైనస్ అవుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవాలి. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ఇదీ.. అనిల్ చెబుతున్న లక్ష్యం.

తనే కాదు. నానీలు.. అందరూ.. కూడా ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. కానీ.. ఇప్పు డు ప్రజల్లోకి వెళ్లాల్సింది.. నాయకులే. ఈ క్రమంలో దూకుడు వల్ల ప్రయోజనం లేదని.. అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉన్న అనిల్ .. నియోజకవర్గాన్ని ఏమేరకు అభివృద్ధి చేశారు ? అని ప్రజల నుంచి ప్రశ్న వస్తే.. ఏం సమాధానం చెబుతారు ? అనేది మేధావుల మాట.

దీనికి కూడా వారు ఒక రీజన్ చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. సత్తా చూపించేది రాజకీయంగా కాదు.. అభివృద్ధిలోనూ.. ప్రజల సమస్యలను నెరవేర్చడంలోనూ.. ఇవి కాకుండా.. కేవలం ప్రగల్భాల కోసం.. రాజకీయంగా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు.. అనిల్ లాంటి నాయకులు ప్రయత్నాలుచేయడం వల్ల ప్రయోజనం మాట అటుంచితే.. ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి ? అనే ప్రశ్న తెరమీదికి వస్తుంది. అంతిమంగా అది పార్టీకే నష్టం చేకూరుస్తుందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి నాయకులు.. అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Discussion about this post