March 24, 2023
యాంటీ టీడీపీ ఫార్ములా..జోగయ్యతో పవన్‌కు రిస్క్..!
ap news latest AP Politics TDP latest News

యాంటీ టీడీపీ ఫార్ములా..జోగయ్యతో పవన్‌కు రిస్క్..!

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే దాదాపు ఉంటుందనే చెప్పాలి. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు గాని..అనధికారికంగా చంద్రబాబు-పవన్ మాత్రం పొత్తు దిశగానే వెళుతున్నారు. వీరి పొత్తు ఉంటే జగన్ కు చెక్ పడిపోతుంది. అందుకే ఈ పొత్తు చెడగొట్టడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదే సమయంలో జనసేనలో ఉండే కొందరు నేతలు సైతం పొత్తు లేకుండా చేయడానికే చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని, 100 సీట్లు ఇవ్వాలని ఇలా రకరకాల డిమాండ్లు పెడుతూ పొత్తు చెడగొట్టడానికే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక మొదట నుంచి చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉండే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం అదే బాటలో ఉన్నారు. గతంలో ఈయన టి‌డి‌పిలోనే పనిచేశారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా చేశారు. కానీ తర్వాత చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. ప్రజారాజ్యంలో పోటీ చేశారు. కొన్నాళ్లు వైసీపీ కోసం పనిచేశారు.

ఇప్పుడు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడుగా ఉంటూ పవన్‌కు మద్ధతుగా ఉన్నారు. పవన్ కు సపోర్ట్ ఇవ్వడంలో తప్పు లేదు..కానీ టి‌డి‌పి-జనసేన పొత్తు చెడగొట్టేలా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా కాపు నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జోగయ్య వచ్చారు. ఇక ఆయన పొత్తుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

జగన్ పరిపాలన బాగోలేదని, రాబోయే ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని జోగయ్య పిలుపునిచ్చారు. అయితే జగన్ ఓడిపోవాలంటే… అది కేవలం పవన్ వల్లే సాధ్యమని, పవన్‌ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని, రాష్ట్రంలో పవన్‌కు మద్దతు ఇచ్చి… జాతీయ రాజకీయాలకు చంద్రబాబు వెళ్లాలని జోగయ్య సూచించారు.

ఏపీలో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో లోకేష్‌ను అధికారంలో భాగస్వామిని చేయాలని, ఒకవేళ జనసేనతో పొత్తు లేకుండా..రాబోయే ఎన్నికల్లో ఓడితే… టీడీపీ అడ్రెస్ గల్లంతు అవుతుందని అన్నారు. అయితే ఇక్కడ జోగయ్య చెప్పిన వాటిని టి‌డి‌పి ఆచరించడం కాదు కదా..పట్టించుకునే ఛాన్స్ లేదు. అదే సమయంలో పవన్ కూడా జోగయ్యకు పరోక్షంగానే కౌంటర్ ఇచ్చారు. తమ గౌరవం తగ్గకుండా టి‌డి‌పితో పొత్తు ఉంటుందనే ఆయన అంటున్నారు. అంటే సి‌ఎం సీటు లాంటివి కాకుండా తమ బలానికి తగ్గట్టు సీట్లు తీసుకోవాలని చూస్తున్నారు.