“మాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఓడినా ప్రజల్లోనే ఉంటాం. గెలిచినా. ప్రజల్లోనే ఉంటాం. మమ్మల్ని నమ్మండి!“ ఇదీ.. పార్టీలకు అతీతంగా ఇద్దరు మహిళా నాయకురాళ్లు తిరుపతి ప్రజలకు ఇచ్చిన హామీ. అంతేనా.. అంటే.. కాదు. బీజేపీ తరఫున బరిలో నిలిచి… ఓడిపోయిన.. మాజీ ఐఏఎస్ అధికారి.. రత్న ప్రభ అయితే.. తాను ఓడినా.. గెలిచినా.. త్వరలోనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి.. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు సాయం చేస్తానని.. కూడా హామీ ఇచ్చారు.

ఇక, మాజీ ఎంపీ..పనబాక లక్ష్మి అయితే.. తిరుపతి ప్రజలను తన కుటుంబ సభ్యులతో పోల్చారు. తాను కుటుంబానికి దూరంగా ఉంటానా? అని సెంటిమెంటును రగిలించారు. ఇవన్నీ.. గత ఏడాది జరిగిన.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లు తిరుపతి ప్రజలకు ఇచ్చిన హామీలు. అయితే.. ఇప్పటికి ఏడాది ముగిసింది. ఆ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. వీరు ఇక్కడ కనిపించలేదు. అంతెందుకు.. అసలు ఆయా పార్టీల తరఫున కనీసం వాయిస్ కూడా వినిపించడం లేదు.

రత్న ప్రభ బీజేపీ తరఫున బరిలో నిలిచారు. పట్టుబట్టి.. బీజేపీ అధిష్టానం ఆమెకు తిరుపతి ఛాన్స్ ఇచ్చింది. అయితే.. ఆమె ఓడిపోయిన తర్వాత.. తిరిగి పార్టీ ముఖం కూడా చూడలేదు. నిజానికి ఎన్నికలన్నాక.. అందునా.. ఉప ఎన్నికల్లో.. సెంటిమెంటు బాగా పనిచేస్తుంది. సో.. వీరి ఓటమిని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ, నిలబడి.. ప్రజల సమస్యలపై కలబడి ఉంటే.. ప్రజల్లో గుర్తింపు ఉండేదని.. వారిని ప్రజలు నమ్మేవారని .. అంటున్నారు పరిశీలకులు.

కానీ.టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మి కానీ, ఇటు రత్న ప్రభ కానీ.. ఎక్కడా కనిపించ డం లేదు. పోనీ.. ఓటమి నుంచి ఇంకా.. బయటపడలేదు.. అనుకునేందుకు తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరిగి.. ఏడాది అయింది. సో.. ఇంకా బాధ నుంచి తేరుకోలేదా? లేక.. మనకు ఎందుకులే రాజకీయాలు అనుకున్నారా? అనేది ప్రశ్న. లేదా.. పార్టీల చావు పార్టీల నేతలు ఛస్తారు.. మనం ఎన్నికలకు ముందు ప్రయత్నాలు చేసి టికెట్లు తెచ్చుకుందామని అనుకున్నారా? ఇదే నిజమైతే.. మళ్లీ మళ్లీ ఓటమి ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post