ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు..ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్ ముందుగా ఏపీపై ఫోకస్ చేశారు. అక్కడ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పార్టీ ఆఫీసుని మొదలుపెట్టారు. ఇక ఇక్కడ వలసలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. పవన్‌కు సన్నిహితుడుగా ఉన్న ఈయన గత ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించలేదు..ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈయనకే అధ్యక్ష బాధ్యతలు దక్కనున్నాయని తెలిసింది. ఇక తోట..2009లో ప్రజారాజ్యం నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏ మేర సత్తా చాటుతారో చూడాలి. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

ఈయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల ముందు జనసేనలోకి వచ్చి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లారు. నిదానంగా బీజేపీకి కూడా దూరమయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళుతున్నారు. అయితే ఏపీలో పెద్దగా బలం లేని నేతలని చేర్చుకుని కేసీఆర్ ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తారో చూడాలి.
