నవ్యాంధ్ర.. అరాచకంగా మారుతోందని.. జాతీయ మీడియా ఎద్దేవా చేసింది. తాజాగా గత వారం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ట అన్నట్టుగా.. టీడీపీ కేంద్ర కార్యాలయం సహా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను జాతీయ మీడియా హైలెట్ చేసింది. నిజానికి ఇలాంటి దాడులు యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. అందుకే అక్కడ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ.. కేంద్రం పారామిలిటరీ దళాల పర్యవేక్షణను కొనసాగిస్తోంది. ఇక, ఇప్పుడు దక్షిణాదిలో కనుక ఇలాంటి పరిస్థితి వస్తే.. అది ఏపీ సీఎం జగన్‌కు తీవ్ర అవమానకరమని.. జాతీయ మీడియా ఎద్దేవా చేసింది.

ఇప్పటికే జగన్ ఫ్యాక్షన్ ముద్ర ఉందని పేర్కొన్న జాతీయ మీడియా.. తాజాగా జరిగిన పరిణామాలను అత్యంత వేగంగా ఆయన సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హిందూ, ఏఎన్ ఐ, రిపబ్లిక్ టీవీలు.. ఇదే విషయంపై చర్చించడం గమనార్హం. రాష్ట్రంలో కొన్నాళ్లుగా మాదక దవ్యాల విషయం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో ఉన్న గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 21 వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు లభించినప్పుడు.. దాని లింకులు విజయవాడలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి రగులుతున్న వివాదం.. విశాఖ మన్యంలో గంజాయి సాగు, అక్రమ రవాణా.. వరకు వచ్చింది. దీనికి సంబంధించి తమిళనాడు, యూపీ, తెలంగాణ పోలీసులు ఈ జిల్లాలో జల్లెడ పట్టారు. ఇది వివాదంగా మారి.. టీడీపీ నేతలు వ్యాఖ్యలుచేసేవరకు వచ్చింది.

ఈ పర్యవసానంగా.. అధికార పార్టీపై టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనిని రాజకీయంగా చూడాల్సిన వైసీపీ.. భౌతిక దాడుల వరకు తీసుకురావడాన్ని జాతీయ మీడియా ఆక్షేపించింది. “రాష్ట్రంలో ఏం జరుగుతోందో.. ప్రజలకు అర్ధం కావడం లేదు. సీఎం ఇంటికి సమీపంలోనే టీడీపీ ఆఫీస్‌ను ధ్వంసం చేయడం.. రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడడం వంటివి ఏపీలో అరాచకానికి నాంది పలికినట్టుగా భావించాల్సి వస్తోంది“ అని జాతీయ మీడియా స్పష్టం చేసింది. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా మౌనం వహించారని.. ఇది శాంతి భద్రతలకు తీవ్ర విఘాతమని పేర్కొంది.

అరాచకం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోందని.. మరో జాతీయ పత్రిక పేర్కొంది. ఇలా.. ఇప్పటి వరకు లేని వివాదాల చుట్టూ.. ఏపీ తిరుగుతుండడం.. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండడం.. ఇప్పుడు రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్ చేయడం.. వంటివాటిని ప్రధానంగా ప్రస్థావించిన జాతీయ మీడియా.. నెల రోజుల కిందట.. చంద్రబాబు ఇంటిపై దాడిని కూడా ప్రధానంగా పేర్కొనడం గమనార్హం. మరి సీఎం జగన్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Discussion about this post