ఈ సారి అభ్యర్ధులని ప్రకటించే విషయంలో మొహమాటలు ఉండవని టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. గతంలో కొంత మొహమాటం పడటం వల్ల గెలిచే బలం లేని వారికి కూడా సీట్లు ఇచ్చారు. దాని వల్ల టిడిపికి డ్యామేజ్ అయింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చంద్రబాబు అంటున్నారు. అందుకే గెలిచే అవకాశం ఉన్నవారికే సీటు ఇస్తామని, మొహమాటం పడి ఎవరికి సీటు ఇవ్వమని చెప్పేస్తున్నారు.

ఒకవేళ నాయకులు ఎదురుతిరిగితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడమని అంటున్నారు. ఏదేమైనా ఈ సారి గెలుపు గుర్రాలకే సీటు ఇస్తామని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు కీలక నేతల వారసులు సీట్లు ఆశిస్తున్నారు. అయితే ప్రజల్లో బలం ఉన్నవారే సీట్లు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ తనయులు ఎంపీ సీట్లు ఆశిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు చింతకాయల విజయ్ ఆశిస్తుండగా, కాకినాడ ఎంపీ సీటు జ్యోతుల నవీన్ ఆశిస్తున్నారు. అయితే కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఫార్ములా గతంలో బాబు అమలు చేశారు. కాకపోతే కొందరికి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో తమకు కూడా రెండు సీట్లు కావాలని కొందరు నేతలు అంటున్నారు.

ఎలాగో అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో పోటీ చేస్తారు..కానీ తన తనయుడుకు అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతున్నారు. కాకపోతే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ సీటు..జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ విజయ్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇటు జ్యోతుల నెహ్రూ..జగ్గంపేట నుంచి పోటీ చేస్తారు..ఇటు కాకినాడ ఎంపీ సీటు నవీన్‌కు అడుగుతున్నారు. ఇక్కడ కూడా జనసేన తో చిక్కులు ఉన్నాయి. కానీ నవీన్ కు గెలిచే ఛాన్స్ ఉంది. మరి వీరి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.