గంటా మురళీ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే. అప్పుడెప్పుడో 2004 వైఎస్ జమానాలో ఆ గాలిలో కాకలు తీరిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుపై గెలిచిన ఎమ్మెల్యే. మేడవరపు అశోక్ శ్రీనివాస్ మాజీ రాజ్యసభ సభ్యులు, కాకలుతీరిన రాజకీయ యోధుడు కేవీపీ రామచంద్రరావుకు స్వయానా బావమరిది. చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్. ప్రస్తుత కామవరపుకోట ఎంపీపీ భర్త. చింతలపూడి నియోజకవర్గ రాజకీయాల్లో ఇద్దరూ ఇద్దరే. 2001కు ముందు అశోక్ టీడీపీలో విద్యాధరరావు అనుచరుడిగా ఉంటే.. నాడు మురళీ కాంగ్రెస్‌లో ఉండేవారు. అప్పట్లో రాజకీయ వైరం అంతంత మాత్రంగా ఉండేది. 2007లో అశోక్ అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఒత్తిడితో కాంగ్రెస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ గెలుపు కోసం బాగా కష్టపడ్డారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరు ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు నిప్పు మాదిరిగా మారిపోయారు. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టేది కాదు.. ఇప్పటకీ అదే కంటిన్యూ అవుతోంది.


వాస్తవానికి మురళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అశోక్ కాంగ్రెస్‌లో చేరారు. 2009 నాటికి వీరి మధ్య లైట్‌గా పొరాపొచ్చలు వచ్చాయి. వైఎస్సార్ మరణం తర్వాత నాడు ఏలూరు ఎంపీ, ఆ తర్వాత కేంద్రమంత్రి అయిన కావూరు సాంబశివరావు అండతో మురళీ దూకుడుగా ముందుకు వెళ్లారు. అశోక్, ఆయన వర్గాన్ని పూర్తిగా అణగదొక్కేశారు. ఏఎంసీ చైర్మన్‌గా ఉన్న అశోక్ పదవిని రెన్యువల్ కాకుండా అడ్డుకోవడంతో పాటు తన వర్గానికే చెందిన తూతా లక్ష్మణ్‌రావుకు ఈ పదవి ఇప్పించుకున్నారు. కావూరు మంత్రిగా ఉన్నప్పుడు మురళీకి ఏపీఐడీసీ చైర్మన్ పదవి వచ్చింది. ఆ టైంలో మురళీ ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.


మురళీ తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేయడం అశోక్‌లో కసిని, కోపాన్ని పెంచింది. అందుకే మురళీ సొంత పంచాయతీ పాతూరుతో పాట ఆయన సొంత సొసైటీ కామవరపుకోట రాజకీయాల్లోకి అశోక్ పరోక్షంగా ఎంటర్ అయిపోయారు. దశాబ్దాలుగా మండల కేంద్రమైన కామవరపుకోట పంచాయతీ మురళీ కనుసన్నల్లోనే, వారి ఫ్యామిలీ కిందే ఉంటోంది. ఆ పంచాయతీని 2013లో ఆ ఫ్యామిలీ చేతుల నుంచి జారేలా చేయడంలో అశోక్ తనవంతు పాత్ర పోషించారు. ఇక నాడు కాంగ్రెస్‌లో ఉన్న అప్పటి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (అశోక్ బావ)కు మురళీ పదే పదే అశోక్‌పై కంప్లైంట్లు చేయడం కూడా మురళీ, అశోక్ మధ్య పగకు మరింత కారణమైంది.


2013లో మురళీ టార్గెట్‌గా చేతులు కలిపిన అశోక్, కోటగిరి :
2013లో కామవరపుకోట మండల చరిత్రలో ఏ ఎన్నిక జరగనట్టుగా కామవరపుకోట సొసైటీ ఎన్నికలు పెద్ద కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి. ఆ ఎన్నికలలో నాడు కాంగ్రెస్‌లో ఉన్న మురళీ, మాజీ మంత్రి విద్యాధరరావు వేర్వేరుగా తలపడ్డారు. మురళీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. విద్యాధరరావు, అశోక్ టీడీపీ సానుభూతిపరులతో కలిసి మరో వర్గంగా పోటీపడ్డారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో మురళీ సపోర్ట్ చేసిన ప్యానెల్ విజయం సాధించింది. అయితే నాడు మురళీ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కావూరు అండదండలు ఉన్నాయి. అశోక్, కోటగిరికి ఎలాంటి పదవులు లేవు.


జూలైలో పెద్ద యుద్ధం గెలిచినోడే అసలు విన్నర్…
ఇక తనను ఇబ్బంది పెట్టడంతో పాటు…. 2013 పరాభవానికి రివేంజ్ కోసం అశోక్ ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మురళీని సొంత పంచాయతీలోనే అశోక్ చావుదెబ్బకొట్టారు. అయితే ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నారు. మురళీ టీడీపీలో ఉంటే, అశోక్ వైసీపీలో కీ రోల్లో ఉన్నారు. కామవరపుకోట సొసైటీ ఎన్నికల్లో ఏ అభ్యర్థి పోటీలో ఉన్నా అక్కడ పరోక్ష పోరు మురళీ వర్సెస్ అశోక్ మధ్యే ఉంటుంది. ఈ పోరులో అధికార బలాన్ని ఎదుర్కొని మురళీ సొసైటీపై తాను నిలబెట్టిన ప్యానెల్‌ను గెలిపించుకుంటే నిజంగా రాజకీయంగా తలెత్తుకున్నట్టే.. తన పట్టు నిలుపుకున్నట్టే..! పార్టీ అధికారంలో ఉండి, కీలక పదవిలో ఉన్నప్పుడు గెలిపించుకోవడం కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… పార్టీ కష్టాల్లో ఉన్న ఇలాంటి టైంలో అశోక్‌ను ఢీ కొట్టి గెలిస్తే అది ఖచ్చితంగా గ్రేటే అవుతుంది. మరి అశోక్ ఆ ఛాన్స్ ఇస్తాడా ? పంచాయతీ ఎన్నికల్లాగానే మరోసారి మురళీకి పరాజయం రుచి చూపిస్తాడా ? అన్నది జూలైలో తేలిపోనుంది. ఏదేమైనా 2013 తర్వాత ఆ స్థాయిలో మరోసారి కామవరపుకోటలో కురుక్షేత్ర యుద్ధం చూడబోతున్నాం. ఈ యుద్ధంలో ఎవరు పోటీ చేసినా యుద్ధం అంతా మురళీ, అశోక్ మధ్యే ఉంటుంది.


Discussion about this post