ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి టిడిపి అధినేత చంద్రబాబు కసిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టిడిపిలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాగే సత్తా లేని నాయకులకు సీట్లు ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయారు. గతంలో మాదిరిగా మొహమాటానికి పోయి సీట్లు ఇవ్వాలని బాబు అనుకోవడం లేదు.

అందుకే సరిగ్గా పనిచేయకపోయినా సరే బాబు నేతలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటినుంచే బలమైన అభ్యర్ధులని బరిలో దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుని బరిలో దింపడానికి రెడీ అయ్యారు. సీనియర్ నేత అయిన అశోక్..1978 నుంచి 2009 వరకు విజయనగరంలో వరుసగా గెలుస్తూ వచ్చారు. ఒక్క 2004 ఎన్నికల్లోనే ఓడిపోయారు. అయితే 2014లో అశోక్‌ని విజయనగరం ఎంపీగా నిలబెట్టారు. అక్కడ ఆయన గెలిచారు. ఇటు విజయనగరం అసెంబ్లీలో మీసాల గీత గెలిచారు.
2019 ఎన్నికల్లో అసెంబ్లీలో అశోక్ కుమార్తె అతిథి, పార్లమెంట్ లో అశోక్ పోటీ చేశారు. అయితే జగన్ గాలిలో ఇద్దరు ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ప్రయోగం చేయాలని బాబు అనుకోవడం లేదు. అందుకే విజయనగరం అసెంబ్లీ బరిలో అశోక్‌నే దింపాలని బాబు భావిస్తున్నారు.
పైగా ఇప్పుడు అక్కడ టిడిపి బలపడింది..వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో అశోక్ బరిలో ఉంటే విజయం ఖాయమని తెలుస్తోంది. మరి అశోక్ కుమార్తెని పార్లమెంట్ బరిలో దించుతారా? లేక ఆమెను పక్కన పెడతారా? అనేది చూడాలి. మొత్తానికైతే అసెంబ్లీ బరిలో అశోక్ దిగడం ఖాయం…గెలవడం కూడా ఫిక్స్ అని చెప్పవచ్చు.
