రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసుకున్నా.. వైసీపీ ప్రజాప్రతినిదులే కనిపిస్తున్నారు. 151 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు మొత్తం వైసీపీవే ఉన్నాయి. ఇక, పంచాయతీల్లో ఒకటి అర తప్పితే..అన్నీ వైసీపీ మద్దతు దారుల చేతుల్లోనే ఉన్నాయి. మరోవైపు 25 పార్లమెంటు స్థానాల్లో 22 స్థానాల్లో వైసీపీ ఎంపీలు ఉన్నారు. అంటే.. మొత్తంగా 85 శాతం మంది ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇది.. ఏ రాష్ట్రంలోనూ ఒక ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం. అదేసమయంలో పెద్ద మైలు రాయికూడా! అయినప్పటికీ.. వైసీపీ వచ్చే ఎన్నికలపై భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజ యం సాధిస్తామో.. లేదో.. అన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. ఏంటి? ఎందుకుఇంత మంది ఉన్నప్పటికీ.. పార్టీ అధిష్టానం బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది? అనేది కీలక చర్చగా మారింది. అసలు విషయం ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది.

చేతినిండానాయకులు ఉన్నా.. నియోజకవర్గాలు ఉన్నా.. జగన్‌కు మాత్రం నిద్ర పట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే.. ఎలా అనే దిగులు ఆయనను కమ్మేసింది. దీనికి ప్రధాన కారణం.. గత ఎన్నికల్లో ఏవిధంగా అయితే.. నాయకులు.. పార్టీ కూడా తనపై ఆధారపడిందో ఇప్పుడు కూడా అదేసీన్ కనిపిస్తోంది. `జగన్ సీఎం అవడం అవసరం. అంటే.. మేం ఎలాగూ గెలుస్తాం. ఆయనే ఏదో ఒకటి చేస్తారు!“ అని నాయకులు సర్దుకుంటున్నారు.

ఎవరూ కూడా ఒక్కరూపాయి బయటకు తీయడం లేదు. నిజానికి ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి నిధులు అందకపోయినా.. వారి వారి వ్యాపారాలు.. వ్యవహారాలు పుంజుకునేలా చేయడంలో ప్రభుత్వ విధానాలు సాయం చేశాయి. ఈ విషయంలో ప్రతిపక్షం లెక్కలతో సహా వివరిస్తోంది. అయినప్పటికీ.. నాయకులు రేపటి పరిస్థితి ఏంటో అని అననుమానిస్తున్నారో.. లేక.. ఖర్చు చేయడం ఇష్టంలేదో తెలియదు.

ఏ నాయకుడు రూపాయి ఖర్చు పెట్టడం.. లేదు.. బయటకు వచ్చి సర్కారుకు సానుకూలంగా పనికూడా చేయడం లేదు. ఈ రెండు పరిణామాలు.. జగన్‌ను తీవ్రంగా వేధిస్తున్నాయని అంటున్నారు. దీనిపైనే ఆయన దృష్టి పెట్టినట్టు సమాచారం.

Discussion about this post