రాష్ట్రంలో మారుతున్న పరిణామాలను టీడీపీ నాయకులు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది? ఏవిధంగా తాము అడుగులు వేయాలి.. వచ్చే ఎన్నికల్లో ఎలా విజయం దక్కించుకోవాలి? వంటి కీలక అంశాలపై వారు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌లతో ఒక నివేదికను చంద్రబాబు తెప్పించుకున్నారని తెలిసింది. గడిచిన ఆరు మాసాలుగా జగన్ సర్కారుపై ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయంపై వీరు.. ఒక నివేదిక ను చంద్రబాబుకు పంపినట్టు సమాచారం.
ఎందుకంటే.. తొలి రెండున్నరేళ్ల కాలంలో జగన్ పాలన ఎలా ఉందనేది నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేకుం డా పోయింది. ఎందుకంటే.. రెండు సంవత్సరాలు పాటు కరోనాతో రాష్ట్రం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిం ది. దీంతో ఆ సమయాన్ని వదిలేసి.. ఇటీవల ఆరు మాసాల పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏమనుకుంటున్నారని.. చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లే ఏ పార్టీకైనా కీలకంగా మారనున్నాయి. ఇలా అందిన రిపోర్టులను క్రోడీకరించి..వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోను కూడా రూపొందించాలని బాబు భావిస్తున్నట్టు సీనియర్లు చెబుతున్నారు.
ఇక, ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. ముఖ్యంగా నివేదికలు సమర్పించిన ఇంచార్జ్‌లు చేసిన లెక్కల ప్రకారం.. ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఎలాగంటే.. ప్రస్తుతం జగన్ పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. ఒక్కఛాన్స్‌తో తన జీవితాలు మారుతాయని అందరూ భావించారు. అయితే.. ఈ ఒక్క ఛాన్సే తమకు ఏమీ లేకుండా చేసిందనే బావన ప్రజల్లో ఉందని.. పార్లమెంటరీ ఇంచార్జులు ప్రధానంగా చెబుతున్నారు. వారు అనేక ప్రాంతాల్లో పర్యటించారు.
చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు అనేక నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల మైండ్ సెట్‌ను తెలుసుకున్నారు. “గతంలో రోజుకు 500 సంపాయించే వాళ్లం. మూడు వందలు ఖర్చు పెట్టుకున్నా.. 200 మిగిలేదు. ఇప్పుడు రోజుకు ఎంత సంపాయించినా.. రూపాయి కూడా మిగలడం లేదు. పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? “ కొందరు చేసిన వ్యాఖ్యలను నివేదికలో పొందు పరిచినట్టు కృష్ణాజిల్లా మచిలీపట్నం టీడీపీ బాధ్యుడు వ్యాఖ్యానించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆవేదనతోనూ.. ఆందోళనతోనూ ఉన్నారని అంటున్నారు. ఇది చంద్రబాబుకు మంచి మార్కులు పడే లా చేస్తోందని అంటున్నారు.
Discussion about this post