కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏపీలో బీజేపీ హడావిడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేకపోయినా సరే బీజేపీ నేతలు ధీమా వేరు. ఇక ఎవరైనా తమ మాట వినాల్సిందే అనే కాన్ఫిడెన్స్ ఉంది. అసలు ఏపీలో తాము సత్తా చాటడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. అయితే బిజేపి కాన్ఫిడెన్స్ లో తప్పు లేదు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపికి భయపడుతుందనే భావన ప్రజల్లో ఉంది.

ఇటు ప్రతిపక్ష టిడిపి సైతం బిజేపిని పెద్దగా ప్రశ్నించలేకపోతుంది. అటు జనసేన ఎలాగో బిజేపితో పొత్తులో ఉంది. దీంతో బిజేపి హవా నడుస్తోంది. కానీ రాష్ట్రంలో బిజేపితో ఎవరైతే కలుస్తారో వారికి భారీ షాక్ తగలడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఎందుకంటే బిజేపి రాష్ట్రానికి చేసిన సాయం పెద్దగా లేదు. ప్రత్యేక హోదాతో పాటు ప్రధానమైన విభజన హామీలు అమలు చేసే విషయంలో వెనుకబడింది. అందుకే ఏపీ ప్రజలు ఇంకా బిజేపిపై ఆగ్రహంగానే ఉన్నారు. బిజేపితో ఎవరైతే పొత్తులో ఉంటారు వారికి నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు.

ఆ మధ్య కూడా టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావచ్చని, అదే టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే అధికారంలోకి రావడం కష్టమని సర్వేలో తేలింది. ఒకవేళ జనసేన-బిజేపి కలిసిన ప్రయోజనం శూన్యమని తెలుస్తోంది. ఇక పరోక్షంగా బిజేపితో అంటకాగుతున్న వైసీపీకి కూడా నష్టమే అంటున్నారు.

అందుకే తెలుగు తమ్ముళ్ళు బిజేపితో పొత్తు వద్దు అంటే వద్దు అంటున్నారు. ఒక శాతం ఓట్లు లేని బిజేపితో కలిసి ముందుకెళితే టిడిపికే నష్టమని అంటున్నారు. అటు జనసేన శ్రేణుల్లో ఇదే అభిప్రాయం ఉంది. బిజేపికి దూరంగా ఉంటేనే బెటర్ అని చెబుతున్నారు. చూడాలి మరి ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో.
