తాడిపత్రిలో టీడీపీ రాజకీయం మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాడిపత్రి అంటేనే జేసీ సోదరులకు ఎలాంటి కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి చోట 2019 ఎన్నికల్లో జేసీ సోదరులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ నుంచి పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్మిత్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయినా కూడా జేసీ సోదరులు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి పట్టు నిరూపించుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా తాడిపత్రిలో మాత్రం ఆ పార్టీ సంచలన విజయం సాధించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించారు. ఇదిలావుంటే ఇటీవల ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఇది జిల్లాలో మిగిలిన టిడిపి నేతలకు నచ్చలేదు. అధిష్టానం సైతం జేసీ ప్రభాకర్ రెడ్డిని మిగిలిన నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాడిపత్రిలో టిడిపి జెండా ఎగరాలి అంటే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చైర్మన్ అభ్యర్థిగా ఉండటంతోనే అక్కడ టిడిపి విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రభాకర్ రెడ్డి అయితేనే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై విజయం సాధిస్తారన్న సర్వే రిపోర్టులు చంద్రబాబు జెసి సోదరుల ముందు ఉంచారట.

వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రెడ్డి అయితేనే అక్కడ పార్టీ గెలుస్తుందని… ఆయనే పోటీ చేయాలని కూడా చెప్పేశారట. ఇక అనంతపురం పార్లమెంటు నుంచి మాత్రం మరోసారి పవన్ కుమార్ రెడ్డికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే అశ్మిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు తాను హామీగా ఉంటానని కూడా చంద్రబాబు జేసీ సోదరుల తో చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాబు నిర్ణయం మేరకు 2024 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖరారయినట్లే.

Discussion about this post