తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా తాజాగా చంద్రబాబు ఖమ్మం సభ జరిగిందని చెప్పవచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయ్యాక..తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ పెరిగింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయగా, ఆ సభకు అధినేత చంద్రబాబు వచ్చారు. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.

ఈ సందర్భంగా బాబు…గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని వివరించి..మళ్ళీ పార్టీ కోసం మాజీ తమ్ముళ్ళు సహకరించాలని కోరారు. ఇతర పార్టీల్లోకి వెళ్ళిన వారు తిరిగిరవాలని కోరారు. అయితే బాబు పిలుపుకు ఎవరు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. కానీ అదే ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీడీపీ మద్ధతు పలకడం చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసి..రాష్ట్ర విభజన నేపథ్యంలో తుమ్మల టీడీపీని వదిలి బీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

అలాగే పాలేరు ఉపఎన్నికల్లో గెలవడం, కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేయడం జరిగింది. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఇక తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో పాలేరులో పోరు నడుస్తోంది. ఇటు తుమ్మలకు ఎమ్మెల్సీ గాని, మంత్రి పదవి గాని రాలేదు. అలాగే సీటు కూడా గ్యారెంటీ లేదు. దీంతో తుమ్మల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే తుమ్మలకు స్థానిక టీడీపీ శ్రేణులు మద్ధతు ఇస్తున్నాయి. అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తుమ్మల వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేసిన మద్ధతు ఇస్తామని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. తాజాగా ఖమ్మంలో బాబు సభ జరగడం, మళ్ళీ టీడీపీ యాక్టివ్ అవ్వడంతో..తుమ్మల టీడీపీ వైపు వస్తారనే ప్రచారం వస్తుంది. మరి చూడాలి తుమ్మల రాజకీయం ఎలా ఉంటుందో.

Leave feedback about this