టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన సంచలన ప్రకటన మేరకు.. వచ్చే ఎన్నికల్లో పార్టీలోని యువ తకు పెద్దపీట వేస్తారు. అవి కూడా పార్టీ పదవులు కాకుండా.. ఏకంగా టికెట్లు ఇచ్చే కార్యక్రమానికే ఆయన శ్రీకారం చుడతానని చెప్పారు. మొత్తంగా టీడీపీ 40 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించిన చంద్రబా బు ఈ సందర్భంగా యువతను తనవైపు తిప్పుకొనేందుకు బాగానే ప్రణాళిక వేశారు. దీని ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా.. 70 నియోజకవర్గాల్లో ఆయన (40శాతం) యువతకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే.. ఇంతమంది అసలు పార్టీలో ఉన్నారా ? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. గత ఎన్నికలను పరిశీలి స్తే.. ఎక్కువ మంది వారసులకు టికెట్లు ఇచ్చారు. వీరి సంఖ్య 25 దాటలేదు. వీరిలో గెలిచింది.. కేవలం ఆదిరెడ్డి భవానీ మాత్రమే. మిగిలిన వారంతా ఓడిపోయారు. ఇప్పుడు 70 మంది యువ నేతలకు అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో వారిని ఎక్కడ నుంచి తీసుకువస్తారు? అనేది ప్రశ్న.

పార్టీలో యువత ఉన్నప్పటికీ.. అసెంబ్లీకి కానీ.. పార్లమెంటుకు కానీ.. పోటీ చేసి.. గెలిచే రేంజ్‌లో అయితే.. వారు ప్రజల్లో తిరగడం లేదు. వీరిని ముందుగా సన్నద్ధం చేయాలి. ఒకవేళ ఇవ్వాలని అనుకున్న యువ నాయకులను ఇప్పుడే ఎంపిక చేయాలి. వచ్చే రెండేళ్ల పాటు.. వారికి శిక్షణ ఇవ్వాలి.. ప్రజల్లో తిప్పాలి. దీనికి చాలానే ఖర్చు అవుతుంది. పైగా ఎంపిక చేసిన వారిలో ఎంత మంది ఈ ఖర్చును తట్టుకుని నిలబడగలరు… ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అదే సమయంలో వైసీపీ దూకుడును తట్టుకుని స్థానికంగా ఉన్న సమస్యలను అర్ధం చేసుకుని.. వ్యూహాలు వేసే నాయకులు కావాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏడాదిన్నర కిందట.. 33 శాతం మంది యువతకు ప్రాధాన్యం ఇస్తానని.. ఇప్పటి వరకు 10 శాతం కూడా ఇవ్వలేదు. దీనిని బట్టి..చంద్రబాబు వ్యూహం ప్రకారం.. 70 మంది అభ్యర్థులను సమర్థులైన వారికి ఎంపిక చేసేందుకు ఇప్పటి నుంచే ప్లానింగ్ తో ఉండాలి. మరి బాబు ఏం చేస్తారో ? చూడాలి.

Discussion about this post