Site icon Neti Telugu

బాబుని రెండోవైపు పెద్దిరెడ్డి ముందు చూస్తారా?

సింహా సినిమాలో బాలయ్య డైలాగులు చాలా ఉన్నాయి..పదునైన డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి డైలాగుల్లో చూడు..ఒకవైపే చూడు..రెండోవైపు చూడాలనుకోకు..తట్టుకోలేవు..మాడిపోతావ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే ఉంటుంది. ఇక అదే తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా చంద్రబాబు, బాలయ్య కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక భోగి సందర్భంగా..జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1ని భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా బాబు..మాట్లాడుతూ..తన జీవితంలో ఇలాంటి అరాచక పాలన చూడలేదని,  పోలీసులను ఉపయోగించుకుని నేరాలు చేస్తున్నారని, వైసీపీలో అధికశాతం మంది ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా చితికిపోయారని, రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని.. పేటీఎం బ్యాచ్ చెలరేగిపోతోందని మండిపడ్డారు.

అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ గా బాబు విరుచుకుపడ్డారు. పండగపూట తమ కార్యకర్తలను జైల్లో పెట్టావని, భవిష్యత్‌లో పెద్దిరెడ్డి ఎక్కడ ఉంటావో ఊహించుకో.. ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకొస్తానని, వదిలిపెట్టానని వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఇంతవరకు తన సున్నితత్వం చూశారని, ఇకపై కఠినాన్ని చూస్తారని, వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. అంటే బాబు మాటలు బట్టి చూస్తే పెద్దిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దిరెడ్డి..ఏ స్థాయిలో బాబుని గాని, టీడీపీ శ్రేణులని గాని టార్గెట్ చేశారో తెలిసిందే. అందుకే అధికారంలోకి రాగానే తన రెండు వైపు కఠినత్వాన్ని చూస్తారని హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి బాబు అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుందో. 

Exit mobile version