వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు టీడీపీ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన కోసం టీడీపీ కొన్ని సీట్లు కేటాయించాలి. అంటే టీడీపీ నేతలు సీట్లు త్యాగాలు చేయాలి. ఎందుకంటే టీడీపీకి 175 స్థానాల్లో నేతలు ఉన్నారు. జనసేనకు ఆ స్థాయిలో నేతలు లేరు. అలాగే టీడీపీకి ఉన్న బలం జనసేనకు లేదు. అందుకే టీడీపీనే త్యాగం చేయాల్సిన పరిస్తితి.

అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఇస్తారని, ఆ సీట్ల పేర్లు బయటకొస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం లాంటి సీట్లు జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆ మూడుచోట్ల టీడీపీకి బలమైన ఇంచార్జ్‌లని పెట్టలేదనే టాక్ ఉంది. ఇదే క్రమంలో తాజాగా భీమవరం ఇంచార్జ్‌గా ఉన్న తోట సీతారామలక్ష్మీ..చంద్రబాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్తితులని బాబుకు వివరించారు. ఇటు బాబు కూడా భీమవరంలో పార్టీ పరిస్తితి బాగానే ఉందని , కానీ సభ్యత్వాలు తక్కువగా ఉన్నాయని, కాబట్టి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

ప్రజల వద్దకు వెళ్లాలని, సమన్వయంతో అన్ని విషయాలు వారితో చర్చించాలని, వైసీపీ ప్రభుత్వ అరాచకాలను వారికి అర్థమయ్యేలా చెబుతూనే టీడీపీ ఆవశ్యకత ఎలాంటిదో చెప్పాలని సీతారామలక్ష్మీకి బాబు సూచించారు. ఇక పొత్తుల గురించి ప్రస్తావన రాగా, పొత్తుల వ్యవహారం తాము చూసుకుంటామని, మీరు ఎక్కడికక్కడ కష్టపడి పనిచేయండని, పార్టీ విజయానికి వీలుగా ప్రజలతో కలిసి మెలిసి వ్యవహరించండని స్పష్టం చేశారు.

అయితే భీమవరం సీటు మాత్రం ఫిక్స్ చేయలేదు. దీని బట్టి చూస్తే పొత్తులో భాగంగా ఈ సీటు మాత్రం జనసేనకు ఖచ్చితంగా తెలుస్తారని తెలుస్తోంది. పవన్ పోటీ చేసినా, మరొకరు పోటీ చేసినా ఈ సీటు జనసేనకే అంటున్నారు.
