May 31, 2023
telangana politics

ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చా..

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు.

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కి తీసుకెళ్లారని ఈ సందర్భంగా శ్రావణి వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధిని చూసి ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యానని, ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీలో నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

ఒక ఎమ్మెల్యే అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, కన్నీరు పెట్టుకొని బయటకు వచ్చానని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడుచురాలైన తనను అవమానించారని, పార్టీ నాయకత్వం కూడా తనకు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. తనను ఆడబిడ్డగా ఆదరించి అర్వింద్, బండి సంజయ్, రాష్ట్ర నాయకత్వం తనను అక్కున చేర్చుకుందని శ్రావణి తెలిపారు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్న ఆమె.. రాష్ట్రంలో,  జగిత్యాలలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఒక సైనికురాలిలా పనిచేస్తానని భరతమాత సాక్షిగా చెబుతున్నానన్నారు. పార్టీలో ఎలాంటి పదవులు ఆశించలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు.