ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి వరుసగా ఓడిపోతున్న స్థానాల్లో మదనపల్లె కూడా ఒకటి. గత మూడు ఎన్నికల నుంచి ఇక్కడ టిడిపి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టిడిపి ఉంది. అందుకు తగ్గట్టుగానే టిడిపి సైతం కష్టపడుతుంది. కాకపోతే ఇక్కడ ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ. దాని వల్ల టిడిపికి ఇబ్బంది అవుతుంది.
గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ముస్లిం ఓటర్ల ప్రభవమే ఎక్కువ. ముస్లిం అభ్యర్ధులు విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నవాజ్ బాషా విజయం సాధించారు. అయితే ప్రస్తుతానికి ఆయనపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. ఇటీవల సర్వేల్లో కూడా ఇక్కడ వైసీపీ గెలుపు కష్టమని తేలుతుంది. కాకపోతే ఇక్కడ టిడిపి ఇంకా బలపడాలి. ప్రస్తుతం ఇంచార్జ్ గా రమేష్ ఉన్నారు..ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కానీ ముస్లిం ఓటర్లని ఆకర్షించడంలో రమేష్ కాస్త వెనుకబడ్డారు.

దీంతో అధిష్టానం అభ్యర్ధిని మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా..టిడిపిలోకి వచ్చారు. తాజాగా లోకేశ్ పాదయాత్ర మదనపల్లెలో జరిగింది. ఆ సమయంలో షాజహాన్ టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు.
అంతకముందే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యి వచ్చారని తెలిసింది. ఇక ఈయనకు కీలక హామీ లభించడంతో టిడిపిలో చేరిపోయారు. ఇక 2009లో ఈయనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈయన టిడిపి నుంచి నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.