ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో సీటు దొరక్క చాలా మంది నేతలు తీవ్ర ఆవేదనతో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. సీటు దొరికిన వారిలో కొందరు ఫుల్ హ్యాపీగా ఉంటే.. మరికొందరు మాత్రం ఆవేదనతో ఉన్నారు. ఇంకొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాదు.. వీరు.. మాకెందుకు ఈ బాధలు.. బాధ్యతలు.. అని తల పట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూకూడా జగన్‌కు అత్యంత ఆప్తులే కావడం గమనార్హం. అంతేకాదు.. జగన్ దగ్గర మంచి పేరుకూడా ఉంది. అయితేనేం.. ఈ ఇద్దరూ ఇప్పుడు పదవులపై విరక్తితో ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ప్రభుత్వం చేసే ఏ పనికైనా.. ప్రవేశ పెట్టి అమలు చేసే ఏ పథకానికైనా నిధులు సమకూర్చాల్సింది ఆయనే. అంతేకాదు.. ప్రభుత్వాన్ని నడపాల్సిన ఆర్థిక బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. అయితే.. వస్తున్న ఆదాయానికి .. ప్రభుత్వం పెడుతున్న ఖర్చులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఖజానా ఏనెలకు ఆ నెలే.. తుడిచి పెట్టుకుపోతోంది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగని అప్పుల కోసం నేరుగా వెళ్తే ఎవరూ ఇవ్వడం లేదు.దీంతో కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పని ఏర్పడింది. ఈ విషయంలో ప్రతినెలా ఆయన ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. అయితే.. కొన్నిసార్లు తాను కోరింది ఢిల్లీలో పెద్దలు చేస్తున్నారు. లేకపోతే.. రేపు మాపు అని తిప్పుతున్నారు. ఇక, ఇటీవల సీఎం పర్యటనలోనూ ఆర్థిక విషయాలు చర్చకు రావడానికి సీఎంపై బుగ్గన చేసిన ఒత్తిడే కారణమని తెలిసింది. మళ్లీ ఇంతలోనే ఖజానా ఖాళీ అయిపోయింది. కేవలం 20 రోజుల్లోనే 18 వేల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయాయి. మళ్లీ 1 వ తారీకు వస్తోందంటే.. పింఛన్లు, జీతాలు.. ఇతర వ్యయాల భారం మళ్లీ బుగ్గనపైనే పడనుంది. దీంతో ఆయన విసిగి వేసారి పోతున్నారని అంటున్నారు.ఇక, మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. యువకుడు, ఉత్సాహవంతుడు, వివాద రహితుడే అయినా.. ఆయన కూడా మంత్రి పదవిపై ఏమంత సంతోషంగా అయితే లేరని అంటున్నారు వైసీపీ నాయకులు.
దీనికి కూడా సీఎం జగన్ వైఖరే కారణమని తేలుస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకురావాల్సిన బాధ్యత పరిశ్రమల మంత్రిగా మేకపాటిపైనే ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఆశించిన రీతిలో పెట్టుబడులు రాలేదు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడి ఆకర్షణ విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు. దీంతో మేకపాటి అటు విదేశీ పెట్టుబడి దారులను ఒప్పించలేక.. ఇక్కడ నిబంధనలను కాదనలేక సతమతం అవుతున్నారు. ఇలా.. కేబినెట్ మొత్తంగా ఎవరికీ ఇంత బాధలేదని అంటున్నారు వైసీపీ నాయకులు.
Discussion about this post