కొత్తపల్లి శామ్యూల్ జవహర్ 2014 ఎన్నికల్లో తొలిసారిగా టిడిపి నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 వరకు తాను తన నియోజకవర్గ అభివృద్ధి అన్నట్టుగానే జవహర్ ఉండేవారు. అలాంటి వ్యక్తికి 2017లో సమీకరణాల నేపథ్యంలో భాగంగా బాబు క్యాబినెట్లో అనూహ్యంగా మంత్రి పదవి వచ్చింది. మంత్రి అయిన వెంటనే కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే పార్టీలో ఓ బలమైన సామాజిక వర్గం తమ చెప్పుచేతల్లో ఉండేందుకు ఇష్టపడకపోవడంతో ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆ సామాజిక వర్గం నేతల బలమైన లాబీయింగ్ ఫలించడంతో గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టికెట్ రాలేదు.

ఏ మాటకు ఆ మాట తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బలంగా కొమ్ముకాసే కమ్మ సామాజిక వర్గం నేతలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాడతారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిలో వారే కలహించుకుంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తుంటారు. గత ఎన్నికల్లో కొవ్వూరులో అదే జరిగింది. ఆ నేతలు జవహర్ కు టికెట్ రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నించినా జవహర్ సత్తా ఏంటో బాబుకు తెలుసు. జవహర్‌ను వదులుకునేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గం అయిన కృష్ణా జిల్లాలోని తిరువూరు నుంచి పోటీ చేయించారు. జగన్ ప్రభంజనంలో జిల్లాలో మహామహులు అయిన నేతలు అందరూ చిత్తుగా ఓడిపోయినా.. జవహర్ మాత్రం తిరువూరులో ఒక విధంగా గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.

ప్రతిపక్షంలోనూ జవహర్‌ది అదే పోరాటం.. మెచ్చిన బాబు :
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా జవహర్ మాత్రం మీడియాలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఇదే చంద్రబాబుతో పాటు లోకేష్ ను సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కీలకమైన రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జవహర్ ను నియమించారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు టిక్కెట్ జవహర్ కి ఇచ్చే క్రమంలో బాబు ఆయనకు ఈ కీలక పదవి అప్పగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు తిరువూరు నియోజకవర్గానికి ఇప్పటికే సామల దేవదత్‌ను కొత్త ఇన్చార్జిగా నియమించారు.

కొవ్వూరు రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిధిలోనే ఉంది. ఈ క్రమంలోనే జవహర్ కొవ్వూరుతో పాటు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు టికెట్ జవహర్ కు ఇచ్చే విషయంలో బాబుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో జవహర్ కు టికెట్ రాకుండా అడ్డుపడ్డ ఆ సామాజిక వర్గం మరోసారి బాబుపై ఒత్తిడి తెస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు కూడా జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇవ్వాలనే కొవ్వూరుకు ఇప్పటి వరకు ఇన్చార్జిని కూడా నియమించలేదు.

జవహర్ సామాజిక వర్గ పరంగా కూడా టీడీపీకి చాలా ప్లస్ అయ్యారు.. అవుతున్నారు. జవహర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కొవ్వూరు నుంచే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఘంటా పథంగా చెబుతున్నారు. ఇంత కష్టపడినా పార్టీ తనకు కొవ్వూరు సీటు ఇవ్వకపోతే తన కష్టానికి అర్థం ఉండదన్న ఆవేదన కూడా ఆయనలో ఉంది. కొవ్వూరు సీటు ఇవ్వని పక్షంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానే కానీ మరోచోట నుంచి పోటీ చేయనని ఆయన సన్నిహితులతో అన్నట్లు కూడా తెలుస్తోంది. మరి చంద్రబాబు ఈసారైనా జవహర్ లాంటి కీలక నేతకు సరైన స్థానం కట్ట పెడతారా లేదా తన సొంత సామాజికవర్గ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతారా ? అన్నది చూడాలి.

Discussion about this post