‘జగనన్న కాలనీలు’…జగన్ ప్రభుత్వం ప్రజలని మాయ చేసే మరో స్కీమ్. ఇప్పటికే ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఆ పథకాల్లో ఉన్న లొసుగులు ప్రజలకు పూర్తిగా తెలియదనే చెప్పొచ్చు. ప్రతి పథకంలోనూ ఏదొక లొసుగు ఉంటూనే ఉంది. ఆ విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కానీ ఆ విషయం ప్రజలకే అర్ధం కావట్లేదు.ఇప్పుడు కూడా జగనన్న కాలనీలు పేరిట పెద్ద మోసం చేస్తున్నారని అంటున్నారు. అసలు ఆ కాలనీల పేరిట జరిగే మాయ ఏంటో ఇప్పుడు చూద్దాం. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట మొదట్లోనే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున స్థలాల్లో అక్రమాలకు చేశారనే విమర్శలు వచ్చాయి.
ఇక ఆ విషయాలు ప్రజలకు కూడా తెలుసనే చెప్పుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ పేరిట పట్టణంలో ఉన్న పేదలకు సెంటు, గ్రామాల్లో ఉన్న పేదలకు సెంటున్నర స్థలం ఇచ్చారు. ఈ స్థలంలో ఎంత ఇల్లు కట్టుకోవచ్చో వైసీపీ నేతలకే బాగా తెలుసు. డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఎంత ఉంటుందో, ఈ స్థలాల్లో కట్టే ఇల్లు అంతే ఉంటుంది.పైగా మొదట్లో ఈ స్థలాలని లబ్దిదారుల పేరిట రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మరి ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారో లబ్దిదారులుకు-ప్రభుత్వానికే తెలియాలి. అలాగే మొదట్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒకటే ఆప్షన్ లబ్దిదారులకు ఇచ్చింది. అది ఏంటంటే కేవలం లక్షా 80 వేలు మాత్రం ఇస్తాం, దాంతోనే ఇల్లు కట్టుకోవాలని ప్రభుత్వం చెబుతుంది.అసలు లక్షా 80 వేలుతో ఇల్లు పూర్తి అవుతుందా? అనేది ప్రజలకు తెలియనిది కాదు. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ లక్షా 80 వేలులో కేంద్రం ఇచ్చేది లక్షా 50 వేలు, జగన్ ఇచ్చేది 30 వేలు. గతంలో చంద్రబాబు ఉండగా కేంద్రం ఇచ్చే లక్షా 50 వేలు కాకుండా, రాష్ట్రం నుంచి లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే టిడ్కో ఇళ్ల పేరిట మంచి నాణ్యమైన ఇళ్లని ప్రజలకు కట్టించి ఇచ్చారు. కానీ ఆ టిడ్కో ఇళ్ల పరిస్తితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక నిర్మాణం పూర్తి అయిన ఇళ్లని జగన్, తమ ఖాతాలో వేసుకుంటున్నారు.ఇక కాలనీల్లో మౌలిక వసతుల పేరిట 30 వేల కోట్లపైనే ఖర్చు పెడతామని అంటున్నారు. ఇందులో కూడా కేంద్ర సాయం చేయాలనే ఈ మధ్య జగన్, మోదీకి లేఖ రాశారు. మరి కేంద్ర సాయం రాకపోతే మౌలిక సదుపాయాలు కష్టమే. ఎందుకంటే ఊరు చివర్లలో ఏర్పాటు చేసే ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేకపోతే ఎంత కష్టమవుతుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలు ఇంటి నిర్మాణానికి సరిపోవు కాబట్టి, మిగతా డబ్బులు లబ్దిదారులే ఖర్చు పెట్టాలి.
పైగా బయట ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఐరన్, సిమెంట్, ఇసుక, ఇటుకలు, కూలీలు…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ రేటు పెరిగింది. ఉదాహరణకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక ఇంటికి 6-7 లక్షలు ఖర్చు అయితే, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక 10-12 లక్షల ఖర్చు అవుతుంది. ఇక దీని బట్టే పరిస్తితి ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవచ్చు. చివరిగా జనాలకు బంపర్ ఆఫర్ ఏంటంటే సొంతంగా స్థలాలు ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి జగన్ ప్రభుత్వం సాయం చేయడం లేదు.
Discussion about this post