కోనసీమ అంటే దివంగత బాలయోగి పేరు ఎక్కువగా గుర్తొస్తుందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి..ఎస్సీ సామాజికవర్గానికి అండగా నిలబడుతూ..కోనసీమలో తనదైన ముద్రవేసుకుని..లోక్‌సభ తొలి తెలుగు స్పీకర్‌గా సత్తా చాటిన బాలయోగి..అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అమలాపురం ఎంపీగా పలుమార్లు పనిచేసిన బాలయోగి మరణం టిడిపికి తీరని లోటుగా మిగిలింది.

అయితే బాలయోగి వారసుడు వచ్చిన హరీష్ తొలి ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అమలాపురం పరిధిలో పనిచేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన్ని అక్కడ నుంచి పి.గన్నవరం అసెంబ్లీ స్థానానికి పంపించారు. చంద్రబాబు తాజాగా పి.గన్నవరం ఇంచార్జ్ గా హరీష్‌ని నియమించారు. దీంతో అమలాపురం పార్లమెంట్ సీటు ఖాళీ అయింది. ఈ సీటుని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్‌కు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది.

ఇటీవలే శ్రీరాజ్..చంద్రబాబుని భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి టిడిపికి అనుకూలంగా ముందుకెళుతున్నారు. అయితే హర్షకుమార్ కాంగ్రెస్ లో ఉన్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చారు గాని..అమలాపురం సీటు దక్కలేదు. దీంతో హర్షకుమార్ మళ్ళీ కాంగ్రెస్ వైపుకు వెళ్లారు.

ఇప్పుడు హర్షకుమార్ తనయుడు టిడిపికి దగ్గరవుతున్నారు. అయితే శ్రీరాజ్‌కు అమలాపురం పార్లమెంట్ సీటు ఇవ్వడం కోసమే…అక్కడ ఉన్న బాలయోగి వారసుడుని పి.గన్నవరంకు పంపించారనే వాదన వస్తుంది. చూడాలి మరి హర్షకుమార్ తనయుడుకు అమలాపురం సీటు దక్కుతుందో లేదో.
