గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి బోల్తా కొట్టిన వాళ్ళలో టీడీపీ నేత బోండా ఉమా ఒకరని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో బోండా గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రిజల్ట్ తారుమారైపోయింది. కేవలం 25 ఓట్ల తేడాతో బోండా ఓటమి పాలయ్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఉమా…మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతుంది. మరి ఈ రెండున్నర ఏళ్లలో ఏమన్నా మార్పు వచ్చిందా? బోండా ఉమా పుంజుకున్నారా? సెంట్రల్‌లో టీడీపీ పరిస్తితి మెరుగు పడిందా? అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే చెప్పొచ్చు.

ఇప్పుడు సెంట్రల్‌లో రాజకీయం బాగానే మారినట్లు కనిపిస్తోంది. బోండా ఉమాకు అనుకూలంగా పరిస్తితులు వచ్చాయి. కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటం వల్ల పైకి మాత్రం…వైసీపీనే బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఆ మధ్య జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. అలా అని సెంట్రల్‌లో వైసీపీకి బలం పెరిగిపోయిందని కాదు. అధికారంలో ఉండటంతో విజయవాడ ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు.

కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్తితి చాలా మారినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా మల్లాది విష్ణుకు మంచి మార్కులు మాత్రం పడటం లేదు. రెండున్నర ఏళ్లలో ఈయన ఎమ్మెల్యేగా సెంట్రల్‌కు చేసిన అభివృద్ధి తక్కువే. ప్రభుత్వ పథకాలే ప్లస్. అటు బోండా ఉమా ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఏ వర్గం ఓటర్లు అయితే దూరమయ్యారో ఇప్పుడు వారు దగ్గరవుతున్నారు.

నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లు మళ్ళీ బోండా వైపే చూస్తున్నారు. పైగా ఇక్కడ వంగవీటి రాధా హవా ఎక్కువగా ఉంటుంది. రాధా మద్ధతుదారులు, కాపు ఓటర్లు సైతం బోండా వైపే ఉన్నారు. ఈ పరిస్తితులని చూస్తే బోండా ఎప్పుడో పాతిక ఓట్లని దాటేసి..ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించుకునేలా ఉన్నారు.

Discussion about this post