విజయనగరం జిల్లా అంటే బొత్స సత్యనారాయణ పేరు ఖచ్చితంగా గుర్తుకొస్తుందనే చెప్పాలి. అంటే ఆ స్థాయిలో విజయనగరంలో బొత్స పెత్తనం ఉంటుంది..అక్కడ ఆయనే బాస్ అన్నట్లు ఉంటుంది. ఇక జిల్లాలో చాలా స్థానాల్లో ఆయనకు అనుచరులు, సన్నిహితులు ఉన్నారు..గెలుపోటములని ప్రభావితం చేయగలరు. గత ఎన్నికల్లో బొత్సతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులే..విజయనగరంలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.
బొత్స చీపురుపల్లిలో గెలిస్తే..బొత్స తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరంలో గెలిచారు. ఇక నెల్లిమర్ల, శృంగవరపుకోట, పార్వతీపురం, బొబ్బిలి..ఇలా పలు చోట్ల బొత్స సన్నిహితులు గెలిచారు. అయితే ఇందులో బొత్సకు మినహా మిగిలిన వారిపై వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు బొత్స తమ్ముడు గురించి మాట్లాడుకుంటే..గజపతినగరంలో ఆయన పట్టు జారుతుంది. మామూలుగా గజపతినగరంలో టిడిపికి పట్టు ఉంటుంది. 1983, 1989, 1994, 2004, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది.

ఇక 2009లో బొత్స అప్పలనరసయ్య కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత తన అన్న బొత్సతో కలిసి వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో పోటీ చేసి 27 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే అప్పటికే టిడిపిపై వ్యతిరేకత ఉండటంతో వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది.
అప్పలనరసయ్యపై వ్యతిరేకత వస్తుంది. అటు టిడిపి నుంచి అప్పలనాయుడు బలపడుతున్నారు. ఇటీవల సర్వేల్లో ఇక్కడ టిడిపికి ఆధిక్యం ఉందని తెలిసింది. అయితే టిడిపి ఇంకాస్త కష్టపడితే..వచ్చే ఎన్నికల్లో బొత్స సోదరుడుని ఓడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.