కర్నూలు జిల్లా అంటేనే కాస్త టీడీపీకి పట్టు లేని జిల్లా అని చెప్పొచ్చు. ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి కంచుకోటలు పెద్దగా లేవు. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అంటే టీడీపీ ఎంత వీక్ అనేది అర్ధం చేసుకోవచ్చు. అలా వీక్‌గా ఉన్న టీడీపీ…ఇప్పుడు నిదానంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా టీడీపీపై వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఉంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవుతుంది.

ఇదే క్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీకి కాస్త అనుకూల పరిస్తితులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో డోన్‌లో టీడీపీ నాలుగు సార్లు గెలిచింది. 1985, 1996(ఉపఎన్నిక), 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా కేఈ ఫ్యామిలీనే గెలిచింది. అసలు డోన్ అంటే కేఈ ఫ్యామిలీ కోట. గతంలో కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్‌లో ఉండగా మంచి విజయాలు సాధించారు. అలాగే టీడీపీలో కూడా సత్తా చాటారు. ఆయన సోదరుడు ప్రభాకర్ సైతం గెలిచారు.

అయితే ఇక్కడ బుగ్గనపై కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్ధిక మంత్రిగా ఉన్నా సరే డోన్‌లో బుగ్గన చేసిన అభివృద్ధి కనబడటం లేదు. దీంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇది టీడీపీకి కలిసొస్తుంది. ఇక సుబ్బారెడ్డికి కోట్ల ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది…అయితే కేఈ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ ఎన్నికల్లో బుగ్గనకు టీడీపీ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.

కానీ రెండు పర్యాయాలు కేఈ మరో సోదరుడు ప్రతాప్ వరుసపెట్టి బుగ్గనపై ఓడిపోతూ వస్తున్నారు. ఓడిపోయాక ప్రతాప్ రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో ప్రభాకర్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన కూడా సరిగా పనిచేయకపోవడంతో ఇటీవల సుబ్బారెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టారు. సుబ్బారెడ్డి వచ్చాక నియోజకవర్గంలో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది. ఇటీవల డోన్ పరిధిలోని బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నికలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఓడిపోయినా సరే…బుగ్గన సొంత వార్డులో సత్తా చాటింది.

Discussion about this post