ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 35 నుంచి 40 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్చార్జి లేకుండా పోయారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి కి దగ్గర అయిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన కొందరు నేతలు పార్టీ మారిపోవడంతో 35 నియోజక వర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఇప్పుడిప్పుడే ఖాళీలను చంద్రబాబు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో చంద్రబాబుకు పెద్ద ఇబ్బంది లేకపోయినా… లోక్‌సభ స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేకుండా పోయారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం – గుంటూరు – విజయవాడ ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో టిడిపి ఎంపీలుగా పోటీ చేసిన వారిలో విజయనగరంలో అశోక్ గజపతిరాజు యాక్టివ్ గా లేరు.

ఒంగోలు లో పోటీ చేసిన సిద్ధ రాఘవరావు – నెల్లూరు లో పోటీ చేసిన బీద మస్తాన్ రావు – అనకాపల్లి లో పోటీ చేసిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలోకి వెళ్లిపోయారు. రాజంపేట లో పోటీ చేసిన డీకే సత్యప్రభ , చిత్తూరులో పోటీచేసిన శివప్రసాద్ మృతి చెందారు. నరసరావుపేటలో ఓడిన రాయపాటి సాంబశివరావు, తిరుపతిలో ఓడిన పనబాక లక్ష్మి ఇప్పటికే వయోభారంతో ఉన్నారు.

రాజమండ్రిలో ఓడిన మాగంటి రూపా దేవి రాజకీయాల పట్ల ఆసక్తితో లేరు. ఏలూరులో మాగంటి బాబు సైతం ఇద్దరు కుమారులు మృతితో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కడప లో ఓడిన ఆదినారాయణ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నారు. కర్నూలులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. అరకు, నంద్యాల లాంటి చోట్ల కూడా టీడీపీకి బలమైన అభ్యర్థులు కనబడటంలేదు. చంద్రబాబు లోక్ సభ అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టి సారించక పోతే ఎన్నికల ముందు ఇబ్బంది పడక తప్పని పరిస్థితి.

Discussion about this post