గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్ల వైసీపీ గెలిచిన సీట్లలో కాకినాడ సిటీ, రూరల్ ముందువరుసలో ఉంటాయి. కేవలం టిడిపి, జనసేనల మధ్య ఓట్లు చీల్చడం వల్లే ఈ రెండు సీట్లని వైసీపీ గెలుచుకుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయి.
గత ఎన్నికల్లో కాకినాడ సిటీలో వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసి..టిడిపి అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావుపై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే సమయంలో అక్కడ జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన అప్పుడే కలిసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు. ఇక కాకినాడ రూరల్ లో కూడా అదే పరిస్తితి. వైసీపీ నుంచి కన్నబాబు..టిడిపిపై 8 వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. అక్కడ జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే పరిస్తితి ఏంటి అనేది ఊహించుకోవచ్చు.

అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి..టిడిపి, జనసేన కలిసి పొత్తులో పోటీ చేసేందుకు రెడీ అయ్యాయి. దీంతో కాకినాడలో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదు. రెండు సీట్లలో పరాభవం ఎదురవ్వడం ఖాయమే. ఇక పొత్తులో భాగంగా టిడిపి, జనసేనకు చెరోక సీటు దక్కే ఛాన్స్ ఉంది. దాదాపు కాకినాడ సిటీ టిడిపికి, రూరల్ సీటు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయి. సిటీలో టిడిపికి పట్టు ఎక్కువ ఉంది. అలాగే నాయకుడు ఉన్నారు. రూరల్ లో టిడిపికి సరైన నాయకుడు లేరు. ఇటు జనసేన బలం పెరిగింది. కాబట్టి ఆ స్థానం జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి కాకినాడలో వైసీపీకి భారీ దెబ్బ తప్పదు.