ఏపీలో ఇన్‌చార్జ్‌లు లేకుండా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను శరవేగంగా నియమిస్తోంది టీడీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే త్వరలోనే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఇన్‌చార్జ్ నియామకంపై కీలక ప్రకటన రానుంది. చింతలపూడి కొత్త టీడీపీ ఇన్‌చార్జ్ ఎవరు ? అనేదానిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. నిన్నటి వరకు ఇక్కడ అగ్రవర్ణాలకు చెందిన నేతకు ఇన్‌చార్జ్ ఇస్తే ఎలా ? ఉంటుందా ? అన్న చర్చ పార్టీలో జరిగింది. అదే జరిగితే విపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందన్న ఆలోచనతోనే ఇప్పుడు ఎస్సీ వర్గాలకు చెందిన వారికే అవకాశం ఇచ్చేద్దామన్న నిర్ణయంతో పార్టీ ఉంది. ఈ పదవి కోసం ఆశావాహులు చాలా మందే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ? ఉన్నా మాజీ మంత్రి పీతల సుజాత వర్సెస్ ట్రాక్టర్ కంపెనీ డీలర్ ఆకుమర్తి రామారావు మధ్యే పోటీ ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన కర్రా రాజారావు మృతి చెందడంతో ఇప్పుడు ఇక్కడ కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించడం అత్యవసరం.

మాజీ మంత్రి సుజాతకు ఇక్కడ బలమైన వర్గమే ఉంది. అయితే ఆమెను వ్యతిరేకించే వర్గం కూడా బలంగా ఉండడంతోనే ఆమెకు గత ఎన్నికల్లో టిక్కెట్ రాలేదు. ఇక రేసులో ముందున్న మరో వ్యక్తి ఆకుమర్తి రామారావు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీకి చెందిన ఆకుమర్తి ట్రాక్టర్ల కంపెనీ డీలర్‌గా మెట్ట ప్రాంతంలో రైతులతో విశేషమైన పరిచయాలు కలిగి ఉన్నారు. ఆయనకు చింతలపూడితో పాటు పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎంతోమందితో పార్టీలతో సంబంధం లేని విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో పార్టీకి ప్లస్ కానున్నాయి. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడుతోన్న ఆయన నారా లోకేష్ సేవా సమితి పేరుతో గత దశాబ్ద కాలానికి పైగా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేష్‌కు చేరువయ్యారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా లోకేష్ సేవా సమితి పేరుతో ఆయన నిర్వహించిన కార్యక్రమాలే పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆకర్షించాయి. గత ఎన్నికలకు ముందు కూడా ఆయన టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసినా అప్పుడు సుజాతకు ఇవ్వాలా లేదా ఇతరులకు ఇవ్వాలా ? అన్న మీమాంసలో రామారావు పేరు చివర్లో పక్కకు వెళ్లిపోయింది. రామారావుకు సామాజిక బలంతో పాటు ఆర్థిక, అంగ బలాలు ఎక్కువ. కొన్ని సంవత్సరాలుగా ట్రాక్టర్ల కంపెనీ డీలర్‌గా ఉండడంతో పార్టీలకు అతీతంగా రైతులతో ఉన్న పరిచయాలే ఆయనకు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న రైతాంగం అంతా పేరు పేరునా ఆయనకు పరిచయం కావడంతో పాటు వివాదాలకు దూరంగా అందరిని సమన్వయం చేసుకోవడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం.

గత ఎన్నికలలో పార్టీ ఓడిపోయాక పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం కేంద్రంగా విజయవంతం చేయడంలో ఆయన ముందు ఉంటున్నారు. ఖర్చు విషయంలో కూడా ఎక్కడా వెనుకాడడం లేదు. ఇక నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయ్యాక ప్రధాన పార్టీల్లో నాడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ, ఇక టీడీపీ కూడా జంగారెడ్డిగూడెం లోకల్ వ్యక్తులకు సీటు ఇవ్వలేదు. నియోజకవర్గంలో ఇక్కడ ఓటు బ్యాంకే సీటు గెలుపులో కీలకం. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయడం కూడా రామారావుకు కలిసొస్తుందేమో ? చూడాలి.

Discussion about this post