ఏపీలో ఇన్‌చార్జ్‌లు లేకుండా ఖాళీగా ఉన్న చోట్ల ఆ పదవిని భర్తీ చేసుకుంటూ వస్తోన్న పార్టీ అధినేత చంద్రబాబు రేపు (శుక్రవారం) చింతలపూడి ఇన్‌చార్జ్ విషయంలో తాడోపేడో తేల్చేయనున్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) నియోజకవర్గ రివ్యూ జరుగుతోంది. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. కొందరు పోలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఇక ఏలూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులుతో పాటు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, 2014లో పార్టీ తరపున గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా హాజరుకానున్నారు.

అలాగే నియోజకవర్గంలో ఉన్న పార్టీ రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వారు ఎలాగూ ఆహ్వానితులే..! ఈ రివ్యూలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ విషయంలో చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేయనున్నారు. బాబు అంతర్గతంగా చేయించిన సర్వేలతో పాటు ప్రోగ్రామ్ కమిటీ ఇచ్చే నివేదికలు.. పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గన్ని నివేదికతో పాటు నియోజకవర్గానికే చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్ర శేషు సూచనలు ఇవన్నీ కూడా కొత్త ఇన్‌చార్జ్ విషయంలో కీలకం కానున్నాయి. ఇక ఈ రివ్యూకు హాజరయ్యే వారి అభిప్రాయాలు కూడా ఎలాగూ పరిగణలోకి తీసుకుంటారు. రివ్యూ జరిగే రోజే ఇన్‌చార్జ్ ఎవరు ? అన్నది డిక్లేర్ చేయకపోయినా … ఈ సమావేశం అనంతరం బాబు నిర్ణయం తీసుకుని వారం, పది రోజుల లోపులోనే చింతలపూడి కొత్త ఇన్‌చార్జ్‌పై అధికారిక ప్రకటన చేసేస్తారని బలంగా తెలుస్తోంది.

కొత్త ఇన్‌చార్జ్ రేసులో మాజీ మంత్రి.. 2014లో చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీతల సుజాతతో పాటు మాజీ జడ్పీచైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆకుమర్తి రామారావు పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. ఈ ముగ్గురు ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రివ్యూ మీటింగ్‌కు వెళ్లే వారితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎలాగైనా ఇన్‌చార్జ్ పదవి దక్కించుకోవాలని ఎవరి ప్లానింగ్‌లో వారు ఉన్నారు. వీరిలో జయరాజు, సుజాత మాల వర్గానికి చెందిన వారు. రామారావు మాదిగ వర్గానికి చెందినవారు.

ఇదిలా ఉంటే ఓసీ ( కమ్మ) వర్గానికి చెందిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ (మురళీ) ఇన్‌చార్జ్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లో మురళీకి ఇన్‌చార్జ్ పదవి ఇచ్చినా ఆయనకు సీటు రాదు. అయితే ఇప్పుడు ఇన్‌చార్జ్ పగ్గాలు చేపట్టడం ద్వారా ఎన్నికలకు ముందు తన కంట్రల్లో ఉన్న వ్యక్తికే సీటు ఇప్పించుకోవాలన్నదే మురళీ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది. అయితే నియోజకవర్గ నేతలతో పాటు కేడర్ కూడా ఎస్సీ సీట్లో ఓసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్‌చార్జ్ పదవి ఇస్తే రాంగ్స సిగ్నల్స్ వెళతాయని.. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని.. ఇలా అయితే పార్టీ ఇక్కడ ఎలా బలపడుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా మురళీ గత ఎన్నికలకు ముందే పార్టీలోకి రావడంతో.. ఆయనకు ఇన్‌చార్జ్ పగ్గాలు ఇవ్వడం పార్టీలో 95 శాతం మంది నాయకులు, కేడర్‌కు ఇష్టం లేదు.

ఇటు మురళీతో పాటు పైన పేర్కొన్న నేతలు అందరూ కూడా రివ్యూ మీటింగ్ నేపథ్యంలో ఇన్‌చార్జ్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా నేతలను కలుస్తూ తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్జ్ లేక అనాథలా ఉన్న చింతలపూడి టీడీపీకి కొత్త నాయకుడిగా ఎవరు వస్తారో ? చూడాలి.
Discussion about this post