2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. అధికార వైసీపీకి భయపడి కొందరు నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు మళ్ళీ నేతలకు ధైర్యం చెప్పి.ఎక్కడకక్కడ కొత్త నాయకులని దించుతూ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు.

కానీ ఇంకా కొన్ని స్థానాల్లో నాయకులు లేరు. అసలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కూడా లేరు. పూతలపట్టు, చిత్తూరు స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. ఇప్పటికీ అక్కడ నాయకులని పెట్టలేదు. పలువురు నేతలు పోటీలో ఉన్నా సరే బాబు ఎందుకో ఆగుతున్నారు. అయితే అలా బాబు నాయకులని పెట్టకుండా ఉండటానికి కారణాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా చిత్తూరు అసెంబ్లీ సీటు విషయంలో..పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకు ఇవ్వడానికి రెడీ అయ్యారని, అందుకే ఈ సీటులో టీడీపీ ఇంచార్జ్‌ని పెట్టలేదని అంటున్నారు.

చిత్తూరు అసెంబ్లీ స్థానంలో జనసేనకు కాస్త బలం ఉంది..కాకపోతే టీడీపీతో పోటీ అయిన బలం జనసేనకు లేదు. కానీ పొత్తులో భాగంగా సీటు ఇవ్వాలి కాబట్టి..చిత్తూరు అసెంబ్లీని జనసేనకు ఇస్తారని తెలుస్తోంది. ఇటు తిరుపతి అసెంబ్లీ సీటుని సైతం జనసేనకే ఇస్తారని ప్రచారం ఉంది.

గతంలో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గెలిచారు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ఇక్కడ టీడీపీ స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయింది. ఇక్కడ జనసేనకు బలం ఉండటంతో ఈ సీటుని ఈ సారి జనసేనకు ఇస్తారని తెలుస్తోంది.
