టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకి భారీ డ్యామేజ్ చేస్తుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. పొత్తు వల్ల కనీసం 50 పైనే సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని టిడిపి, జనసేన కలుస్తున్నాయి. రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి.
ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. అయితే పొత్తు వల్ల వైసీపీకి రిస్క్ ఉంది..కానీ అదే సమయంలో టిడిపి, జనసేనలలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఏ ఏ సీట్లు ఎవరికి దక్కుతాయో తెలియడం లేదు. పైగా జనసేనకు పెద్ద ఇబ్బంది లేదు గాని …సీట్లు వదులుకోవాలంటే టిడిపికే ఇబ్బంది. ఎందుకంటే అన్నీ సీట్లలో టిడిపికి నాయకులు ఉన్నారు..బలం ఉంది. దీంతో సీట్లు త్యాగం చేయాలంటే టిడిపికి కాస్త కష్టం. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో పొత్తుల విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఇక్కడ జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయి..ఏ ఏ సీట్లు దక్కుతాయనే చర్చ వస్తుంది.

ఉమ్మడి కృష్ణాలో విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లు దాదాపు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అవనిగడ్డతో పాటు మరొక సీటు పై జనసేన ఫోకస్ పెట్టింది. మచిలీపట్నం(బందరు) లేదా పెడన సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూడు సీట్లలో టిడిపికి బలమైన నాయకులు ఉన్నారు. జనసేనతో పొత్తు లేకపోయినా..ఈ సారి ఆ స్థానాల్లో టిడిపి, వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
అలాంటి సీట్లని టిడిపి వదులుకోవడానికి ఇష్టపడదు. కానీ ఆయా స్థానాల్లో జనసేన నేతలు మాత్రం..తమ సీట్లే అని ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. బలం లేకుండా సీట్లు మావి అని ఎలా చెబుతారని అంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య కాస్త కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని చంద్రబాబు, పవన్ మాత్రమే తొలగించాలి.