పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ లోకి వెళుతున్నారనే వార్తలతో రాజకీయంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయం తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో నలభై నిమిషాల పాటు భేటీ అయి పార్టీలో చేరేందుకు తన ఆసక్తిని ప్రదర్శించారు. ఈ విషయం చర్చించేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శుక్రవారం అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉండేవారు. 1983 నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన డీఎస్ 2014 వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మూడుసార్లు విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసి పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, డీఎస్ పార్టీకి జోడెడ్లలా వ్యవహరించేవారు. 2004లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడినా డీఎస్ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయి కేవలం పీసీసీ అధ్యక్ష పదవికి పరిమితం అయ్యారు.

2014లో ప్రత్యేక రాష్ట్రం తర్వాత తొలిసారి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి దిగ్గజం అయిన డీఎస్ ఈ ఎన్నికలో ఓడిపోయారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడితో డీఎస్ ప్రత్యక్ష రాజకీయ జీవితానికి తెరపడినట్లయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు టీఆర్ఎస్ లో చేరిన వెంటనే డీఎస్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అనంతరం రాజ్యసభకు పంపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం జరగడంతో టీఆర్ఎస్ లో డీఎస్ జోరు తగ్గింది. డీఎస్ రెండో కుమారుడు అర్వింద్ నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచి కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ డీఎస్ ను దూరం పెడుతూ వచ్చారు.

కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న డీఎస్ కూడా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. సమయం కోసం ఎదురుచూసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఇక్కడ డీఎస్ తపన తన కోసం కాదు.. తన మొదటి కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం. 70 ఏళ్ల వయసు పైబడిన డీఎస్ రాజకీయంగా చేయడానికి ఏమీ లేనందున కనీసం తన పెద్ద కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నారు. ధర్మపురి సంజయ్ గతంలో ఒకసారి నిజామాబాద్ మేయర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ స్థానంపై గురిపెట్టారు. దీని కోసం తన తండ్రి తరపున సంధి నెరుపుతున్నారు. అధిష్ఠానం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Discussion about this post