టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఆ ముగ్గురేనా? రాష్ట్ర, జిల్లా సమస్యలపై నిర్మాణాత్మక విధానంలో స్పందిస్తున్నవారేనా? ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. ఇటు ముఖ్యమంత్రికి, అటు ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లడంలో ముందున్నారా? రాష్ట్ర, జిల్లా అభివృద్దికి దూకుడుగా దూసుకుపోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వారే.. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ యువ ఎమ్మెల్యేలు.. గొట్టిపాటి రవి(అద్దంకి), ఏలూరి సాంబశివరావు(పరుచూరు), డోలా బాల వీరాంజనేయస్వామి(కొండపి). ప్రస్తుతం వీరి చుట్టే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

కొన్నాళ్ల కిందట ప్రకాశం జిల్లాకు వరప్రదాయని వంటి వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంగుర్తించక పోవడంపై తీవ్రస్థాయిలో ఉద్యమించి.. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రానికి కూడా లేఖ లు సంధించారు. స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి.. ఈ ప్రాజెక్టను గుర్తించాలని విన్నవించారు. అదేసమయంలో వెలిగొండ ప్రాజెక్టును విమర్శించిన తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ సంధించారు. ఈ ప్రాజెక్టు వివరాలను అందించారు. దీని ప్రాధాన్యాన్ని వివరించారు. ఇలా.. జిల్లా సమస్యలపై ఈ ముగ్గురు కలసి కట్టుగా పోరాడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన అస్తవ్యస్థంగా ఉందని.. ప్రకాశం జిల్లాను మూడు ముక్కలు చేయడం సమంజసం కాదని ఈ ముగ్గురు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియ నిర్ణయం శాస్త్రీయంగా లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జిల్లా మూడు ముక్కలు అవుతుందన్నారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా.. జిల్లా ప్రజా ప్రతినిధులుగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడిన ప్రకాశం జిల్లా కల నెరవేరదని వారు లేఖలో స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలని కోరారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఉండాలని వారు సీఎం జగన్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల కృషి, రాష్ట్ర, జిల్లాపై చూపిస్తున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం గమనార్హం.
Discussion about this post