ఉమ్మడి చిత్తూరు జిల్లా..పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గాని..ఇక్కడ టీడీపీకి పట్టు తక్కువ. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఈ సారి మాత్రం జిల్లాలో టీడీపీ బలం పెంచాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతవరకు టీడీపీ గెలవని సీట్లపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని స్థానాల్లో గంగాధర నెల్లూరు సీటు ఒకటి.

2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి నారాయణస్వామి గెలుస్తూ వస్తున్నారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పోస్టు దక్కింది. పేరుకు డిప్యూటీ సీఎం గాని..ఈయనకు పెద్దగా అధికారాలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక మంత్రిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అయినట్లు కూడా లేరు. రాష్ట్రంలో చాలామందికి ఈయన మంత్రి అనే సంగతి తెలియదంటే..ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అలాగే సొంత స్థానంలో అభివృద్ధి కూడా అంతంత మాత్రమే…ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మాత్రం ప్లస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ పథకాలని ప్రచారం చేస్తూ..గడపగడపకు వెళుతున్నారు. మొత్తానికి ఇక్కడ నారాయణస్వామిపై వ్యతిరేకత కనిపిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల ఓ సర్వేల్ఓ ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం వైపు మొగ్గు ఉందని తేలింది.

కాకపోతే ఇక్కడ ప్రజలలో విశ్వాసం కల్పించడంలో తెలుగుదేశం ఇంచార్జ్ విఫలమయ్యారు. 2024లో ఇక్కడ టీడీపీ గెలవాలంటే బలమైన నాయకుడు కావాలి..అదే సమయంలో టీడీపీ శ్రేణులు ఇంకా దూకుడుగా పనిచేయాలి. అప్పుడే జీడీ నెల్లూరుని టీడీపీ సొంతం చేసుకోగలదు.
