ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శిలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకునేలా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏ నేత ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంది. మామూలుగానే ఇక్కడ జంపింగులు ఎక్కువ. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో పనిచేసి వైసీపీలోకి జంప్ చేసిన నాయకుడే. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు వైసీపీ నుంచి సీటు డౌట్. దర్శి సీటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కేలా ఉంది. దీంతో మద్దిశెట్టి టిడిపి లేదా జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.



అటు మొన్నటివరకు టిడిపి ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేశ్..ఇప్పుడు జనసేనలోకి వెళ్తారని టాక్. అలాగే వైసీపీలో ఉన్న శిద్ధా రాఘవరావు టిడిపిలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో శిద్ధా టిడిపిలోనే పనిచేశారు. 2014లో దర్శి నుంచి గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. ఇటు దర్శి నుంచి కదిరి బాబూరావు పోటీ చేశారు. ఇద్దరు నేతలు ఓడిపోయారు. ఓడిపోయాక ఇద్దరు నేతలు వైసీపీలోకి జంప్ చేశారు.



కానీ వైసీపీలో వారికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో శిద్ధా టిడిపిలోకి వస్తారనే ప్రచారం వస్తుంది. ఇటు మొన్నటివరకు టిడిపి ఇంచార్జ్ గా పమిడి రమేశ్ పనిచేశారు. దర్శి మున్సిపాలిటీ టిడిపికి దక్కేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.


అయితే ఏమైందో గాని ఆయనకు సీటు విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసి టిడిపిలో కొనసాగుతున్నారు. కానీ ఈ మధ్య జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. మొత్తం మీద దర్శిలో జంపింగుల్లో ట్విస్టులు నడిచేలా ఉన్నాయి.
