Site icon Neti Telugu

దినేష్ రెడ్డి దూకుడు..ప్రసన్నకు చెక్ పెట్టడం సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే పలు నియోజకవర్గాల్లో బాధ్యతలని యువ నేతలకు అప్పగిస్తున్నారు. అలాగే వారికే సీట్లు ఇవ్వడానికి బాబు మొగ్గు చూపుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు సీటుని దినేష్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన దినేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.

మామూలుగా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి బలం ఎక్కువ. గతంలో ఆయన తండ్రి, తర్వాత ప్రసన్న వరుసగా టీడీపీ నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2012లో టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో గెలిచారు. 2014లో శ్రీనివాసులు రెడ్డి చేతిలో ప్రసన్న ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ప్రసన్న..శ్రీనివాసులు రెడ్డిని ఓడించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో ప్రసన్న దూకుడుగా వెళుతున్నారు.

అయితే శ్రీనివాసులు రెడ్డి బదులు ఆయన తనయుడు దినేష్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీంతో దినేష్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో కోవూరు సీటు కూడా ఆయనకే ఫిక్స్ చేశారు. కాకపోతే ఎంతో సీనియర్ అయిన ప్రసన్నకు చెక్ పెట్టడం దినేష్‌కు అంతగా సాధ్యం కాదు.

కానీ తనకు సాధ్యమైన మేర బలం పెంచుకోవడమే లక్ష్యంగా దినేష్ ముందుకెళుతున్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని యాక్టివ్ గా చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే కోవూరులో రాజకీయ సమీకరణాలు చూస్తే..ప్రస్తుతం ప్రసన్నకే అనుకూలంగా ఉన్నాయి. అలా అని ఆయనకు పూర్తి పాజిటివ్ లేదు. కాబట్టి దినేష్ ఇంకాస్త కష్టపడితే ప్రసన్నకు చెక్ పెట్టవచ్చు. మరి కోవూరుని ఈ సారి టీడీపీ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version