అధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతి నియోజకవర్గంలో ఈ సారి రాజకీయం రసవత్తరంగా సాగేలా ఉంది. మళ్ళీ వైసీపీ-టిడిపిల మధ్య పోటీ గట్టిగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి గెలవాల్సింది..కానీ జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి దెబ్బపడింది. దీంతో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి 708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. అప్పుడు జనసేనకు 12 వేల ఓట్ల వరకు పడ్డాయి.
అయితే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచినా సరే నిదానంగా భూమన తన బలాన్ని పెంచుకుతూ వచ్చారు. ఇటు టిడిపి నుంచి సుగుణమ్మ పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. పైగా ఇక్కడ టిడిపిలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. దీని వల్ల టిడిపికి కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని టిడిపికి బలమైన కేడర్ ఉంది..కాకపోతే బలమైన నాయకులు లేకపోవడం మైనస్. అందుకే ఇప్పటికే అక్కడ వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంది.

ఇక వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన పోటీ చేస్తారా? ఆయన తనయుడు పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. కాకపోతే వైసీపీకే గెలుపు అవకాశాలు ఉండటం వల్ల ఎవరు పోటీ చేసిన ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇంకో సమీకరణం ఉంది. ఎప్పుడైతే టిడిపి, జనసేన పొత్తు ఫిక్స్ అవుతుందో అప్పుడు సీన్ మారుతుంది. పొత్తులో భాగంగా ఎవరు పోటీ చేసినా సరే..వైసీపీ గెలవడం కాస్త కష్టమవుతుంది.
రెండు పార్టీలు కలిస్తే వైసీపీని నిలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇక్కడ పవన్ సైతం పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం ఉంది. అదే జరిగితే తిరుపతి రాజకీయం మరో స్థాయికి వెళుతుంది. ఏదేమైనా టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్..లేదంటే వైసీపీ ఈజీగా గెలిచేస్తుంది.
