తెలుగుదేశం పార్టీలో కష్టపడే నాయకులకు కొదవ లేదనే చెప్పొచ్చు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు…పార్టీ కోసం నిత్యం అండగా ఉండే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు…తమ అవసరాలని తీర్చుకుని, అధికారం కోల్పోయాక సైడ్ అయిపోయారు. కానీ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ కోసం నిలబడే నాయకుల్లో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌లు ఉంటారని చెప్పొచ్చు.

జగన్ గాలిని సైతం ఎదురుకుని గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని ఎప్పటికప్పుడు నిలబెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగడకుండా చూసుకుంటున్నారు. ఒక వైపు అధికార వైసీపీ చాలా రకాలుగా టిడిపిని దెబ్బకొట్టడానికి చూస్తుంది. అయినా సరే ఈ ఇద్దరు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటున్నారు. ఎలాంటి ఒత్తిళ్ళు ఎదురైన సరే ఈ ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు.

అందుకే వరుసపెట్టి పంచాయితీ, మున్సిపాలిటీ, ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రం మొత్తం కొనసాగిన…ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో టిడిపి గట్టి పోటీ ఇచ్చేలా చేశారు. పంచాయితీ ఎన్నికల్లో అటు పర్చూరు, ఇటు అద్దంకి నియోజకవర్గాల్లో టిడిపి బాగానే సత్తా చాటింది. ఇక అద్దంకి మున్సిపాలిటీలో టిడిపి ఓడిపోయినా సరే, వైసీపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది.

ఇక ఎంపిటిసి ఎన్నికల్ని పార్టీ బహిష్కరించింది. అయినా సరే కొంతమేర రెండు నియోజకవర్గాల్లో టిడిపి పోటీ ఇవ్వగలిగింది. అద్దంకిలో 72 ఎంపిటిసి స్థానాలు ఉంటే టిడిపి 8 స్థానాలు వరకు గెలుచుకుంది. అటు పర్చూరులో 79 ఎంపిటిసిలు ఉంటే టిడిపి 9 స్థానాలు గెలుచుకుంది. ఓ రకంగా చెప్పాలంటే సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కంటే ఏలూరి, గొట్టిపాటిలు కొంతమేర టిడిపిని నిలబెట్టారనే చెప్పొచ్చు.

Discussion about this post